మహాలక్ష్మి సంబురాలలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 23: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు అయిందని, రూ.6,680 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో బుధవారం జరిగిన సంబరాల్లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఉచిత ప్రయాణాలతో రాష్ట్రంలోని మహిళలు పిల్లల చదువులు, ఆలయాల సందర్శన, నగరాల్లో ఉద్యోగం వంటి అవసరాల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందారన్నారు. ఆర్టీసీ మునిగిపోయే పడవ అని ఆరోజు అన్నారు.. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి నిలదొక్కుకుందని వివరించారు. మహిళల ఉచిత ప్రయాణాలకు అయిన ఖర్చు రూ.6,680 కోట్లను ఆడబిడ్డల పక్షాన ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే చెల్లిస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్టీసీలో కొత్త కొత్త విధానాలు తీసుకురావడం వల్ల ఆదాయం పెరిగిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఒకప్పుడు ఆర్టీసీ ఆక్క్యుపెన్సీ రేషియో 60 శాతంగా ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా అది 97 శాతానికి పెరిగిందన్నారు. హైదరాబాదును కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో ఉన్న డీజిల్ బస్సులను నగరం బయటకు దశలవారీగా తరలిస్తున్నామని, నగరంలో ఉన్న బస్సుల్లో 11 శాతం బ్యాటరీ బస్సులను జత చేశామని చెప్పారు. ఇప్పటికే మూడు వేల బ్యాటరీ బస్సులకు ఆర్డర్ ఇచ్చామని, మరో 500 బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ముందుకుపోతోందని, వారికి వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి లీజుకు ఇప్పించి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే బస్సుల అద్దెలకు సంబంధించి రూ.కోటి నగదును తన ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ సంఘాల మహిళలకు అందించారని వివరించారు. ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామని, అందులో భాగంగా మొదటి ఏడాది లక్ష్యానికి మించి రూ.21, 650 రుణాలు అందించామని వివరించారు. కొద్ది రోజుల్లోనే హైదరాబాదు నగరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పండుగను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్కల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రూ.20వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం, ఉన్న రహదారుల మరమ్మతు, విస్తరణ కార్యక్రమాలు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోతున్నట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజునాడు అసెంబ్లీ ఆవరణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయ్యాయని తెలిపారు. గతంలో ఆర్టీసీ నిర్వీర్యమై ప్రైవేట్‌పరం అవుతుందని భయపడేవారని, కానీ తాము లాభాల్లోకి వచ్చేలా చేశామన్నారు. హ్యామ్ విధానంలో ప్రతి గ్రామం నుండి మండలానికి మండలం నుండి జిల్లా కేంద్రానికి కొత్త డబుల్ రోడ్లు వచ్చే నెలలోనే ప్రారంభిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకం,్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.





