– కాంగ్రెస్‌వి అహంకార రాజకీయాలకు బలయ్యాడు
– ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని బర్తరఫ్ చేయాలి
– పోలీసులు ఎఫ్‌ఐఆర్ మార్చేశారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మక్తల్‌లో తమ పార్టీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పందించారు. మక్తల్ మున్సిపాలిటీలో పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. మహాదేవప్ప ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రామచందర్ రావు మక్తల్ వచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేకే మహాదేవప్ప ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు బలమైన ఆరోపణలున్నాయని ఆరోపించారు. బీజేపీ ర్యాలీ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక బీజేపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రత్యర్థులను బెదిరించి, ఒత్తిళ్లకు గురిచేసి ఒక కార్యకర్త ప్రాణం కోల్పోయే పరిస్థితి తెచ్చే రాజకీయాలు కాంగ్రెస్‌కే పరిమితమని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని తక్షణమే అరెస్టు చేసి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ కార్యకర్తల ఆగ్రహజ్వాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. మహదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు, మంత్రి అనుచరుల ఒత్తిళ్ల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని మహదేవప్ప భార్య స్పష్టం చేశారన్నారు. ఆమెకు చదువురాదు.. అయినప్పటికీ ఆమెతో సంతకం చేయించుకుని వివరాలను మార్చి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇలాంటి దారుణాలు, బెదిరింపు రాజకీయాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది రేవంత్ ప్రభుత్వం కాదు.. రాబందుల ప్రభుత్వం అని విమర్శించారు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు. కొంతకాలం క్రితం మహాదేవప్పకు బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించారు.. కానీ ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చి 6వ వార్డు అభ్యర్థిగా పోటీలో నిలిచారని తెలిపారు. జిల్లా ఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టి తప్పుడు ఎఫ్ఐఆర్‌ను సరిచేయాలని కోరారు. మానవ హక్కుల కమిషన్ కూడా ఇక్కడకు వస్తుందన్నారు. ఎఫ్ఐఆర్‌ను మార్చి తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తరఫున మహాదేవప్ప కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. ఎవ్వరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. పోస్టుమార్టం జరిపించి, తప్పుడు ఎఫ్ఐఆర్‌ను మార్చేవరకు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని రామచందర్‌రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




