-15 నుంచి 17 వరకు నిర్వహణ
మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6:రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ కు శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేస్తున్నాయి. మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి అమ్మవారి పాదాల చెంత నుంచి ప్రవహించే ఈ పవిత్ర క్షేత్రానికి ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా జాతరలో భాగంగా మొదటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రెండో రోజైన 16న జాతరలోనే ప్రధాన ఘట్టమైన బండ్ల ఉత్సవం అత్యంత కోలాహలంగా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదర్శనగా తిరుగుతూ మొక్కులు తీర్చుకుంటారు. ఆఖరి రోజైన 17న రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగుస్తుంది. ఈ జాతరకు కేవలం జిల్లా నుంచే కాక సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్, పొరుగు రాష్టాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు స్నానాల సమయంలో ఇబ్బంది కలగకుండా మంజీరా నదిలోకి నీటిని విడుదల చేయడంతోపాటు ఘాట్ రోడ్ల మరమ్మతులు, బారికేడ్ల నిర్మాణం , తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భారీ పోలీస్ బందోబస్తును కూడా మోహరిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





