– రేపటి నుంచి షురూ
– నాలుగు రోజులపాటు కీకారణ్యం జనారణ్యమే
– ఆధునికత సంతరించుకున్న జాతర
– ప్రయాస లేకుండా తల్లుల దర్శన భాగ్యం
– ఎడ్ల బండి నుంచి వాయువిహంగాల దాకా..
– రేపు పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం
(ప్రజాతంత్ర, హైదరాబాద్)
మేడారం.. సమ్మక్క, సారలమ్మల మహాజాతర.. నిజంగా మహాజాతరే. దక్షిణ కుంభమేళాగా పిలుచుకునే ఈ జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం ప్రారంభమై నాలుగు రోజులపాటు సాగే ఈ జాతరతో మేడారం పరిసర అటవీ ప్రాంతమంతా జనారణ్యంలా మారనుంది. దశాబ్దం కిందట వరకు అడవి గర్భంలో కొలువుతీరే అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఎంతో శ్రమించాల్సి వచ్చేది. కానీ నేడు ఆధునిక సదుపాయాలతో ఏమాత్రం ప్రయాస లేకుండా తల్లుల దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆనేక హంగులను సమకూర్చాయి. పూర్వపు ఎడ్లబండ్ల ప్రయాణం ఉంటే నేడు హెలికాఫ్టర్ ద్వారా జాతరకు చేరుకోగలిగే ఆధునిక సదుపాయాలనేకం. నాడు దట్టమైన అడవి మార్గంలో పయనించడమన్నది ఒక అపురూప అనుభవమైతే నేడు జాతరకు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు అడవన్నదే కనిపించని పరిస్థితి. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం ఆధునికతను సంతరించుకుంది. క్యూ లైన్లు కూడా మారాయి. ప్రాంగణంలో జాతరకు సంబంధించి అనేక భవనాలు వెలిశాయి. మహా జాతరలో భక్తుల కోసం గత ప్రభుత్వాలు చాలావరకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా రెండు శతాబ్ధాల వరకు చెక్కు చెదరకుండా ఉండేందుకు రూ.251 కోట్లతో గద్దెల ప్రాంగణంలో రాతి కట్టడాలను నిర్మించింది. శిల్పాలపైన గిరిజన సంప్రదాయం, ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాకృతులను చెక్కడం ద్వారా తరతరాలకు అమ్మల చరిత్ర తెలిపే ప్రయత్నం చేసింది. ఒకనాడు ఇరుకైన క్యూ లైన్‌ల కారణంగా తొక్కిసలాట జరిగేది. దాన్ని నివారించేందుకు క్యూ లైన్‌లను విస్తరించారు. గతంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకునే భక్తులు ఇబ్బంది పడేవారు. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా గద్దెలన్నిటినీ ఒకే వరుసలో ఏర్పాటు చేశారు. రెండుమూడు జాతరలనుంచి హెలికాఫ్టర్లు కూడా నడుస్తున్నాయి. జాతర ప్రాంగణంలోని ప్రతీ కూడలిని ఈసారి అందంగా తీర్చిదిద్దారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక శిల్పాలను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్ని, చూపరులకు ఆసక్తిని కలిగిస్తున్నది.
రేపు పగిడిద్దరాజు, జంపన్నలు గద్దెలపైకి చేరే ఘట్టం
అమ్మవార్లను గద్దెలకు తీసుకుని రావడం మొదలు.. మళ్లీ అడవికి తరలించే వరకు జాతర సాగుతుంది. ఈ మహా ఘట్టాన్ని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సన్నద్ధమయ్యాయి. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులు సాగుతున్న సమయంలోనే లక్షలాదిమంది ముందస్తుగా అమ్మలను దర్శించుకున్నారు. ప్రధాన జాతర తేదీల్లో భక్తుల రద్దీ కారణంగా గద్దెల ప్రాంగణం వద్ద అమ్మల దర్శనం ఆషామాషీ విషయం కాదు. అందుకే ఈసారి గ్దదెల పునర్నిర్మాణం నేపథ్యంలో ప్రాకారాన్ని విస్తరించారు. రూ.100 కోట్లతో చేపట్టిన ఈ పనులు జాతరకే వన్నె తెచ్చాయి. విస్తరణ నేపథ్యంలో ఏకకాలంలో 9`10 వేల మంది దర్శించుకొనే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. ఊరట్టం పంచాయతీ కన్నెపల్లి గ్రామం నుంచి పోలెబోయిన వంశీయులు మేడారంలోని జంపన్నవాగు ఒడ్డున ఉన్న గద్దెపై రాత్రి 7 గంటలకు జంపన్నను తీసుకురానున్నారు. జంపన్నను ఆదివాసీల్లోని నాలుగో గొట్టుకు చెందిన పోలెబోయిన వంశీయులు దశాబ్దాలుగా కొలుస్తున్నారు. గతంలో ఇంటి వద్దనే పూజలు చేసుకునేవారు. 2022 నుంచి జంపన్నను గద్దెకు తీసుకు వస్తున్నారు. మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పెనుక వంశీయుల ఇలవేల్పు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును మేడారానికి తీసుకెళ్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే గ్రామంలో పెనుక వంశీయులు పగిడిద్దరాజు ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గ్రామంలోని పెనుక వెంటేశ్వర్లు ఇంట్లో పగిడిద్దరాజుకు ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడినుంచి పాన్పును ఊరేగింపుగా గ్రామంలోని ఆలయానికి తీసుకెళ్తారు. అనంతరం పడగ రూపంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి ఊరేగింపుగా మేడారానికి బయల్దేరుతారు. అటవీ మార్గంలో కాలినడకన వెళ్తూ మంగళవారం రాత్రి లక్క్ష్మీపురంలో బస చేస్తారు. బుధవారం ఉదయం మళ్లీ మొదలై మధ్యాహ్నం వరకు మేడారం చేరుకుంటారు. గ్దదెలపై పగిడిద్దరాజును ప్రతిష్ఠించడంతో మహాజాతర మొదటి ఘట్టం మొదలవుతుంది.
ట్రాఫిక్ సమస్యలకు చెక్ .. పలు రూట్లలో రహదారుల విస్తరణ
జాతరలో ట్రాఫిక్ నియంత్రణ సవాల్‌గానే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రోడ్లు, వంతెనల విస్తరణకు ప్రాధాన్యమిచ్చారు. రూ.100 కోట్లు వెచ్చించి జాతీయ రహదారులు, ఆ ర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో 39 ప్రధాన రహదారులను అభివృద్ధి చేశారు. 10 రోడ్లు, మూడు కల్వర్టులను కొత్తగా నిర్మించారు. వాహనదారులకు ప్రయాణం సులభతరం కానుంది. ట్రాఫిక్ నియంత్రణకు 33 చోట్ల దాదాపు 1500 ఎకరాల్లో మూడు లక్షల వాహనాలు నిలిపేలా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తూ యాప్ ద్వారా ట్రాఫిక్ చిక్కులు, దర్శన సమయాల్లో రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టనున్నారు. జాతరకు ఆర్టీసీ విశాలమైన ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. భక్తులకు జంపన్నవాగు వద్ద సౌకర్యాలను ఆధునికీకరించారు. ఘాట్లు మరమ్మతులు చేశారు. బావుల్లో పూడిక తీసి మోటార్లతో వాగులోకి నీరు ఎత్తిపోసే ఏర్పాట్లు చేశారు. ప్రమాదాల నివారణకు 350మంది ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు 268 మంది అగ్నిమాపక సిబ్బంది శకటాలతో సిద్ధంగా ఉన్నారు.
డ్రోన్లు, ఏఐతో పోలీస్ శాఖ శాంతిభద్రతల నిర్వహణ
జాతరలో అత్యంత కీలకమైనది పోలీస్ శాఖనే. జాతరలో 13వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 8 జోన్లు, 42 సెక్టర్లుగా జాతరను విభజించి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 42,027 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మేడారంలో విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు సెల్ సిగ్నల్స్ సమస్య ఉత్పన్నం కాకుండా భారీగా మొబైల్స్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. గత జాతరలో సుమారు 30వేల మంది భక్తులు తప్పిపోయిన నేపథ్యంలో ఈసారి జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. వృద్ధులు, పిల్లలకు పస్రా, తాడ్వాయి మార్గాల్లో క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్‌లను కడతారు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని మేడారంలో అమలు చేస్తున్నారు. 12 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. పాత నేరస్తులను గుర్తించేందుకు అస్పత్రి ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు. టీజీ క్వెస్ట్ అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. 450 సీసీ కెమెరాలు, 20 డిస్‌ప్లే ప్యానల్స్ వినియోగిస్తున్నారు. కౌడ్ కౌంటింగ్ కెమెరాలు, ఫెస్ రికగ్ననైజేషన్ కెమెరాలను కూడా క్యూలైన్‌లు, అధికంగా భక్తులు ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 42 పార్కింగ్ స్థలాలు, 37 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి పస్రా వరకు 4కి.మీ కు ఒకటి చొప్పున, పస్రా నుంచి మేడారం వరకు 2 కి.మీ కు ఒకటి చొప్ప్పున పోలీస్ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మొబైల్ పెట్రోలింగ్ టీమ్‌లు, మప్టీ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





