భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం

– అధికారులు కళ్లు తెరిచే వరకు పోరాటం ఆగదు
– మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ నేతలు

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం స్పష్టమ‌వుతోందని, ఇది భూ భారతి పోర్టలా లేక భూ భక్ష పోర్టలా.. పేదల కోసమే ఆవిర్భవించిన భూదాన యజ్ఞ బోర్డ్ తాజాగా ఖమ్మం వెలుగుమట్లలో భూ కబ్జాదారులకు వరంగా మారిందని, అధికారులు కళ్లు తెరిచే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పల వెంకటరమణ హెచ్చరించారు. బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సాగుతున్న భూదాన్ భూముల అక్రమ దందాపై జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పేదల‌ సొంతింటి కల కోసం వినోబాభావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమ స్ఫూర్తిని నేడు జిల్లాలో కొందరు అధికారులు, రాజకీయ నాయకులు కలిసి సమాధి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రికార్డుల సాక్షిగా పచ్చి అబద్ధాలు.. ఎవరిని మోసం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. 1963 లో సర్వే నంబర్ 147, 148, 149 లలో 31 ఎకరాల 20 గుంటల భూమిని  కుర్రానంద, తులస్య, దేశ్య, షేక్ మజీద్ సాబ్, గలాలు సాబు, అక్బర్ సాబ్, దోమ అచ్చయ్య,  రెంటుపల్లి సుబ్బయ్య, పల్నాటి చంద్రయ్య, రెడ్డబోయిన వెంకటేశ్వర్లు వంటి నిరుపేదలకు కేటాయించారన్నారు. నేడు ‘భూభారతి డిజిటల్ పోర్టల్‌లో అసలైన లబ్ధిదారుల పేర్లు మాయమై 148 సర్వే నంబర్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వ్యవసాయ భూమి ‘నాన్-అగ్రికల్చర్’గా ఎలా మారింది? ఆర్ డి ఓ ప్రొసీడింగ్స్ లేకుండా భూదాన్ భూములను కమర్షియల్ లే అవుట్లుగా మార్చడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? 149 సర్వే నంబర్‌లో 14 ఎకరాల భూమిలో ‘రియల్ బెనిఫిషరీస్’ కనపడకుండాపోవడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలెవరివి? జిల్లా కలెక్టర్.. మీరు చట్టానికి లోబడి పనిచేస్తున్నారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా?  మీ ముందు మూడు సూటి ప్రశ్నలు ఉంచుతున్నామన్నారు. 1.వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని ప్రతి సర్వే నంబర్‌లో భూదాన్ భూమి విస్తీర్ణం ఎంతో బహిరంగంగా చెప్పగలరా? 2. 1963లో దానంగా వచ్చిన భూమికి, నేటి రికార్డులకు పొంతన ఎందుకు లేదు? 3.ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండా భూ బదలాయింపులు చేసిన అధికారులను సస్పెండ్ చేసే దమ్ము మీకుందా అని బిఆర్ఎస్ నాయ‌కులు అడిగారు. సమావేశంలో ఖమ్మం రూరల్ మండల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్,  భాషబోయిన వీరన్న, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగబోయిన సతీష్, నాయకులు బలుసు మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *