-ఏర్పాట్లపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు
– రూ.150 కోట్లతో మేడారంలో శాశ్వత పనులు
– కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బీఆర్‌ఎస్ నాయకులు
తాడ్వాయి, ప్రజాతంత్ర, జులై 27: కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను ఆమె ఆదివారం దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వన దేవతల ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని ప్రార్థించారు. అనంతరం తల్లుల ప్రాంగణంలో 2026లో జరిగే మహా జాతరకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం మహా జాతరకు సంబంధించి రూ.150 కోట్లతో శాశ్వత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్తు, రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు కేటాయించిందని, జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసిందని, భక్తులు, వీఐపీలు బస చేయడానికి వీలుగా మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాట్లు వేసే కూలీలకు పలకరింపు
సమీక్షకు వచ్చిన మంత్రి సీతక్క అ ప్రాంతంలో వరి నాట్లు వేసే కూలీలను ఆప్యాయంగా పలకరించారు. బురద పొలంలోకి దిగి కూలీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వర్షం నుంచి రక్షణకై ప్రత్యేకంగా తయారు చేసిన కవర్లను కూలీలకు మంత్రి పంపిణీ చేశారు. స్వయంగా కవర్లను కూలీలకు తొడిగి, వారి సంక్షేమం, ఆరోగ్యం పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి స్వయంగా తమ వద్దకు వచ్చి పలకరించడంతో కూలీల మోముల్లో దరహాసం వెల్లివిరిసింది.





