– నాడు ఇక్కడినుంచే పాదయాత్ర మొదలుపెట్టా
– అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం
– ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
– పూజారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం
– మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావోద్వేగం
మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా.. తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డపై నుంచే అడుగులు వేశాను అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడారం అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసేందుకు మంగళవారం మేడారం వచ్చిన సీఎం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు.. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నామని సీఎం తెలిపారు. సమ్మక్క-సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, తనకు ఈ జన్మ ధన్యమైనట్లేనన్నారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయని, అందుకే సమ్మక్క` సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామని, మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని, స్థానికుల భాగస్వామ్యం, సహకారం అవసరమని వక్కాణించారు. సమ్మక్క-సారక్క మాలధారణ చేసినట్లు భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహాజాతరకు మళ్లీ వస్తా.. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం.. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు అని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నానని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





