తరతరాలు నిలిచేలా మేడారం అభివృద్ధి

– మరింత విశాలంగా మేడారం ప్రాంగణం
– భక్తులకు మరింత సౌకర్యవంతంగా తల్లుల దర్శనం
– అభివృద్ధి పనులకు త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన
– మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడారం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం జరిగింది. జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధికి సంబంధించి పూజారుల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేయగా సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి పనులకు త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని మంత్రులు ప్రకటించారు. ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు ఏడు వేల మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్యాక ఆ సామర్థ్యం పదివేలకు పైగా పెరగనుంది. ప్రాంగణం వెడల్పు, పొడవు పెరిగి మరింత విశాలంగా మారుతుంది. దీనివల్ల భక్తులు సులభంగా, వేగంగా, క్రమపద్ధతిలో దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. సమ్మక్క, సారలమ్మలతోపాటు అదే వరుస క్రమంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్పుతో భక్తులు ఇబ్బంది లేకుండా ఒకే దారిలో తల్లులను సాఫీగా దర్శించుకునే వీలు కలుగుతుంది. మేడారం ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆదివాసీ ఆధ్యాత్మిక భావన కలిగేలా సాంప్రదాయ ఆర్చిలు నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ రాతి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటిపై ఆదివాసీ కళాత్మక ఆకృతులు, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దన్నారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఈ రాతి కట్టడాలు శాశ్వత చిహ్నాలుగా నిలిచిపోతాయి. అలాగే భక్తుల భద్రత దృష్ట్యా మేడారం ప్రాంగణం చుట్టూ నాలుగు వాచ్‌ టవర్లు నిర్మించాలని భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జాతర కాలంలో ఈ వాచ్‌ టవర్లు విజిలెన్స్‌, సెక్యూరిటీ, కంట్రోల్‌లో కీలకపాత్ర పోషించనున్నాయి. మేడారం అభివృద్ధి కేవలం సదుపాయాలు పెంపునకే పరిమితం కాకుండా ఆదివాసీ సంస్కృతిని, విశ్వాసాన్ని, వారసత్వాన్ని మరింత బలంగా ప్రతిబింబించేలా రూపకల్పన జరుగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రతిపాదిత అభివృద్ధి పనుల పట్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఇతర పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్‌లోపు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీఎం సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, సమ్మక్క-సారలమ్మ పూజారులు, నిపుణులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *