– తెలుగు భాష, సాహిత్య రంగాలకు సేవలు అజరామరం
– తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పాత్రికేయునిగా, న్యాయ కోవిదునిగా, రచయితగా, న్యాయశాస్త్ర పరిశోధకుడిగా, బహు గ్రంథకర్తగా కేంద్ర సమాచార కమిషన్ మాజీ చైర్మన్, మహీంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్, స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ అసాధారణ కృషీవలుడు అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన డాక్టర్ దేవులపల్లి రామానుజరావు 108వ జయంతి ఉత్సవంలో డాక్టర్ శ్రీధర్‌కు రామానుజరావు పురస్కారం ప్రదానం చేశారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శ్రీధర్‌ను రూ.25వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో ఘనంగా సత్కరించారు. దేవులపల్లి రామానుజరావు సారస్వత పరిషత్తు, సాహిత్య అకాడమీ వేదికల ద్వారా తెలుగు భాష, సాహిత్య రంగాలకు అందించిన సేవలు అనితర సాధ్యమని శివారెడ్డి అన్నారు. 50 సంవత్సరాలు సారస్వత పరిషత్తు కోసమే తమ యావచ్ఛక్తిని ధారపోశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ 1953లో అలంపురంలో దేవులపల్లి అధ్యక్షతన జరిగిన పరిషత్తు సభలది గొప్ప చరిత్ర అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడిగానే కాక రెండుమార్లు ఉపాధ్యక్షుడిగా కూడా రామానుజరావు సేవలందించారన్నారు. సాహిత్య అకాడమి ద్వారా తెలుగు సాహిత్యంలోని గొప్ప గ్రంథాలను, నిఘంటువులను, వృత్తి పదకోశాలను అందించారని తెలిపారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ తమ తండ్రి ఎమ్మెస్ ఆచార్య స్థాపించిన జనధర్మ పత్రికలో పాత్రికేయ జీవితం ప్రారంభించి ఎదురుచూడని ఎన్నో అవకాశాలు వినియోగించుకుంటూ వివిధ రంగాల్లో తనవంతు కృషి సాగిస్తున్నానని అన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ మాడభూషి శ్రీధర్ తెలుగు, ఆంగ్లభాషల్లో 60 గ్రంథాలు రచించారని, కేంద్ర సమాచార కమిషనర్‌గా 25 వేల తీర్పులు వెలువరించారని, న్యాయశాస్త్ర విషయాలపై అనేక పరిశోధనలు చేశారని తెలిపారు. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎ.సిల్మా నాయక్ సభను నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.


