– 111 ఫ్లాట్లకు 2,685 దరఖాస్తులు
– ఫ్లాట్ల కేటాయింపునకు రేపు లాటరీ
– యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం
– లాటరీ కేంద్రంలోకి ప్రజలకు ‘నో ఎంట్రీ
– వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లోనూ త్వరలో లక్కీ డిప్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5 : రాష్ట్ర గృహ నిర్మాణ మండలి(హౌసింగ్ బోర్డు) అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం కేటాయించిన ఫ్లాట్లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలితో పాటు వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో నిర్మించిన ఫ్లాట్ల విక్రయానికి బోర్డు నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని 111 ఫ్లాట్ల కోసం ఏకంగా 2,685 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అంటే ఒక్కో ఫ్లాట్‌కు సగటున 25 మంది పోటీ పడుతున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి మంగళవారం (జనవరి 6న) లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. రాంకీ ప్రాజెక్ట్‌లోని 76 ఫ్లాట్లకు లాటరీ తీస్తారు. మధ్యాహ్నం వసంత ప్రాజెక్ట్‌లోని 35 ఫ్లాట్లకు లాటరీ నిర్వహిస్తారు. కాగా దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉన్నందున, భద్రతా కారణాలు, స్థలాభావం దృష్ట్యా లాటరీ నిర్వహించే ప్రాంగణంలోకి ప్రజలను అనుమతించడం లేదని హౌసింగ్ బోర్డు పి.ఆర్.ఓ వి. వాసు తెలిపారు. అధికారుల సమక్షంలో జరిగే ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు, యూట్యూబ్ మరియు ఇతర మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
లైవ్ లింక్:
దరఖాస్తుదారులు https://www.youtube.com/live/gCBIRWz8qt0 అనే లింక్ ద్వారా లాటరీని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. నిర్మిత కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ల ద్వారా కూడా చూడవచ్చని అధికారులు సూచించారు.
వరంగల్, ఖమ్మం షెడ్యూల్ ఇదీ..
మొత్తం 3,096 దరఖాస్తులు రాగా, వివిధ ప్రాంతాల వారీగా లాటరీ తేదీలను బోర్డు ఖరారు చేసింది: హైదరాబాద్ (గచ్చిబౌలి): జనవరి 6 (మంగళవారం), వరంగల్: జనవరి 8 (388 దరఖాస్తులు వచ్చాయి). ఖమ్మం: జనవరి 10 (దరఖాస్తుల గడువు 8వ తేదీ వరకు పొడిగించబడింది). వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్న అల్పాదాయ వర్గాలకు సరసమైన ధరకే ఇళ్లు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ విక్రయ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దరఖాస్తుదారులు సహకరించాలని హౌసింగ్ బోర్డు విజ్ఞప్తి చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





