– రాష్ట్ర ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు
– బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి ప్రార్థనలు
బయ్యారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ప్రపంచవ్యాప్తంగా శాంతి, సహనం, ప్రేమ, ఆప్యాయతలతో మానవులందరూ జీవించేలా ఆశీర్వాదాలు కలగాలని ఏసు ప్రభువును ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. చరిత్రాత్మకమైన బయ్యారం చర్చి నిర్మించి 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చికి చేరుకున్న సోదర సోదరీమణులందరికీ, స్నేహితులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బయ్యారం చర్చికి వచ్చి ఫాదర్‌తో ప్రార్థనలు చేయించుకున్నానన్నారు. ఇతరుల కోసం, వారిని ఇబ్బందుల నుంచి బయటపడేయడం కోసం ఎలా జీవించాలో ప్రభువు జీవితం మనకు నేర్పిస్తుందని పేర్కొన్నారు. ఒకరికి మరొకరు సహాయ సహకారాలతో జీవించేందుకు ప్రభువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థించానన్నారు. ప్రజలందరి యోగక్షేమాల కోసం ఈ అధికారం ఉపయోగపడే విధంగా ప్రభువు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ తోటి వారి కోసం పనిచేద్దామని, బయ్యారంలో అభివృద్ధి కోసం కాక రాష్ట్ర అభివృద్ధి కోసం భగవంతుడు మనకు పూర్తి శక్తినివ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని భట్టి చెప్పారు. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





