రిటైర్డ్ ఉద్యోగులంటే రేవంత్‌కు చిన్న‌చూపు

– ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌క‌పోవ‌డం దుర్మార్గం
– హ‌క్కుల‌ కోసం వేడుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది
–  ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించి, రిటైర్డ్ అయ్యాక బెన్ఫిట్స్ ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమ‌న్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గురువారం మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందచేసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బెన్ఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వేదనకు గురవుతున్నారన్నారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా అంటుందని, అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు… ముఖ్యమంత్రికి మనసు రాక అని విమర్శించారు. మూసి బ్యూటిఫికేషన్ లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం లక్ష కోట్లు, అందాల పోటీల కోసం వందల కోట్లు, తన సోకుల కోసం నిర్వహించే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 100 కోట్లు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు, వివిధ రాష్ట్రాల్లో వందల కోట్లతో పత్రిక ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్డికి బకాయిలు చెల్లించక పోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.98 వేల కోట్లకు టెండర్లు పిలిచారని, బడా కాంట్రాక్టర్లకు 40 వేల కోట్లు చెల్లించారని, కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కమిషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదన్నారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బెన్ఫిట్స్ చెల్లించా లని డిమాండ్ చేసారు.  వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీశ్ రావును కోరారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వివరించారు. 23 నెలలుగా రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనారోగ్యం గురై హాస్పిటల్ ఖర్చులకు కూడా పైసలు లేక తెచ్చిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కడుతూ అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, బకాయిల గురించి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని ధైర్యం చెప్పారు. హరీశ్ రావును కలిసిన వారిలో కోహిడ చంద్రమౌళి, ప్రభాకర్ రావు, జైరాం, భిక్షపతి తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *