పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద భారీ క్యూలు

– సాధార‌ణం కంటే రెండుమూడు రెట్లు అధిక అమ్మ‌కాలు
– అమ్మ‌కాలు పెర‌గ‌డంతో ‘నో స్టాక్’ బోర్డులు
– చ‌మురు, గ్యాస్ స్టాక్ పుష్క‌లం
– పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ, మంత్రుల‌ ప్ర‌క‌ట‌న‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చ్ 25: రాష్ట్రంలో హైదరాబాద్ స‌హా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదనే భయంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.పెట్రోల్, డీజిల్ స్టాక్ అయిపోతుందనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తుతున్నారు. సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోయి ‘నో స్టాక్‌’ బోర్డులు వెలిశాయి. ఇది ప్రజల్లో మరింత భయాన్ని పెంచింది. భవిష్యత్తు అవసరాల కోసం చాలా మంది బాటిళ్లు, ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్ నింపుకుంటున్నారు. ఇది ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ మేఘాల వల్ల ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే పుకార్లు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి. చమురు సంస్థలు (హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌) డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించి, ‘ముందుగా నగదు చెల్లిస్తేనే సరఫరా’ అనే కొత్త నిబంధనను తెచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల కొందరు డీలర్లు తగినంత స్టాక్ తెప్పించుకోలేకపోతున్నారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారనే వార్తలు మరియు కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు హోటల్ యజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మరియు చమురు సంస్థలు ఈ ఆందోళనలను కొట్టిపారేశాయి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురై  ట్యాంకులు నింపుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవొద్దు. వాహనదారులు తమ రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.    పౌరసరఫరాల శాఖ మంత్రి, పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తదితరులు కూడా ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సోషల్ మీడియా వార్తలు అసత్యాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల (సఫిల్‌గూడ, తార్నాక, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మౌలాలి ప్రాంతాల్లో వందల ద్విచక్ర వాహనదారులు, గ్యాస్ బంకుల వద్ద ఆటోవాలాలు ఉదయం నుంచి బారులు తీరారు. 11 గంటలకు కొన్ని పెట్రోల్ బంకులు మూసివేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *