తిరిగి స్పీకర్‌ ‌స్థానంలో విధులకు ఓంబిర్లా

-తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన
-నిబంధనల మేరకే నడచుకున్నానని వెల్లడి

న్యూదిల్లీ, మార్చి 12: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా తిరిగి స్పీకర్‌ ‌స్థానంలోకి వచ్చారు. అలాగే ఆయన తన పనితీరుపైనా స్పందించారు. ప్రతి ఎంపీకి లోక్‌సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని అన్నారు. సభ నియమ నిబంధనలకు ఎవరూ అతీతులు కారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎంపీల మైక్రోఫోన్లను నియంత్రించాననే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు. నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు నడుస్తాయి. ప్రధాని, మంత్రులు కూడా ఏవయినా ప్రకటనలు చేయడానికి ముందు సభ నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలి. మైక్రోఫోన్లు ఆన్‌ ‌లేక ఆఫ్‌ ‌చేయడానికి స్పీకర్‌ ‌వద్ద ఎలాంటి బటన్‌ ఉం‌డదు. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసు. మాట్లాడేందుకు అనుమతి ఉన్న సభ్యుడికి మాత్రమే మైక్రోఫోన్‌ ఆన్‌ అవుతుంది‘ అని తనపై విపక్షాలు కొంతకాలంగా చేస్తోన్న విమర్శలకు బిర్లా సమాధానం ఇచ్చారు. రెండ్రోజుల చర్చ అనంతరం బుధవారం సాయంత్రం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వోటింగ్‌ ‌జరిగింది. మూజువాణి వోటుతో అది వీగిపోయింది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్‌ ‌వేటు వేయడం, కాంగ్రెస్‌ ‌మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ నిశికాంత్‌ ‌దుబెపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పక్రియ పూర్తయ్యేవరకు సభకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న స్పీకర్‌ అది వీగిపోగానే మళ్లీ యథావిధిగా తన బాధ్యతలు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *