– మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ
– డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్
– అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్25: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకునోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి వోట్ల లెక్కింపు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వొస్తుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై స్టే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వోటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం అని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





