‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారు

– మా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలుసు
– మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు,. ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పెద్దలు పదేళ్లల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళిక ప్రకారం వాటిని సరిచేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతొందని చెప్పారు. రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలకు బాగా తెలుసునన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం బీసీల దశాబ్దాల కోరికను నెరవేర్చిందన్నారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించామన్నారు. మీ కోసం నిలబడిన కాంగ్రెస్‌ పార్టీని కనిపించకుండా చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, కుట్రపూరితంగా కోర్టులకు పంపిస్తున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఇచ్చి బీఆర్‌ఎస్‌ పెద్దలు అమలు చేయలేదన్నారు. రూ.లక్ష రైతు రుణ మాఫీని పదేళ్లల్లో కూడా పూర్తిగా చేయలేకపోయారని డిప్యూటీ సీఎం విమర్శించారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం కుంగిపోయిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చిందన్నారు. యువతకు గ్రూప్‌-1, గ్రూప్‌-2 తోపాటు ఇప్పటికే 60వేల ఉద్యోగాలు, రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా, 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు, సన్న ధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌, రూ.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు చొపున రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు భట్టి వివరించారు. రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసి అయిదేళ్లల్లో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *