– రిజర్వేషన్‌లతో సిద్దమవుతున్న ప్రభుత్వం
– పార్టీ పరంగానా లేక చట్ట పరంగానా .. సందిగ్ధంలో అధికార పార్టీ
– ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
అక్టోబర్ రెండవ వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగం సిద్దం చేస్తున్నది. స్థానిక ఎన్నికల విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ప్రధానంగా గ్రామ పంచాయితీల్లో ఎన్నికైన సర్పంచ్‌లు లేక పోవడంతో గ్రామాల అభివృద్ది కుంటుపడుతున్నది. గత సంవత్సరం జనవరి 31తో వారి పదవీకాలం ముగిసింది. అప్పటినుండి ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామ పాలన కొనసాగుతున్నది. అయితే ఈ ప్రత్యేకాధికారులకు ఇతర పనులుండడంవల్ల వారు గ్రామాలపై ప్రత్యేక శ్రద్దను కనబర్చలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. దానికి తగినట్లుగా కోర్టుకూడా స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా మారింది. అయితే బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్లకు చట్టబద్దం కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఆలస్యం జరుగుతుండడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వొస్తున్నాయి. అయితే కోర్టు ఆదేశాలమేరకు సెప్టెంబర్ 30లోగా ఈఎన్నికలు జరుపాల్సి ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగలడంతో ప్రభుత్వం దీనిపైన మల్లగుల్లాలు పడుతున్నది. బిసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు ఈ ఎన్నికల నుండే అమలు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా . అయితే రిజర్వేషన్లకు సంబందించి క్యాబినెట్ సమావేశం, అసెంబ్లీ తీర్మానాలను గవర్నర్ ఆమోదానికి పంపడంతో ఈ ఎన్నికలకు బ్రేక్ పడినట్లైంది. రిజర్వేషన్‌లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర గవర్నర్ వద్ద దాదాపు మూడు నెలలపాటు ఆలస్యం జరగ్గా, దీనిపై న్యాయపర నిర్ణయంకోసం గవర్నర్ జిష్టుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపించారు. అదిప్పుడు కేంద్రంవద్ద పెండిరగ్‌లో ఉంది. ఒకవైపు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాలు, మరోపక్క రిజర్వేషన్లపై గవర్నర్, కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో కొనసాగుతున్న ఆలస్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది . అయినప్పటికీ ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వొచ్చింది. తాజా క్యాబినెట్ సమావేశంకూడా అదే సరైందంటూ తీర్మానించింది. 2011 జనాభ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లను, కులగణ ఆధారంగా 42 శాతం బిసీ రిజర్వేషన్‌లను కల్పించేవిదంగా జిల్లా కలెక్టర్లు నివేదికలు తయారుచేసి సీల్డ్ కవర్‌లో చీఫ్ సెక్రెటరీకి పంపించాలన్న ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఇవ్వాళ రేపు లోపు ఈ నివేదికలు ప్రభుత్వానికి అందనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, కోర్టు ఆదేశించిన ఈ నెల 30కి ఒక రోజు ముందు కోర్టును మరికొంత సమయం ఇవ్వాలని కోరనుందని తెలుస్తున్నది. కాని పక్షంలో ఒక రోజు ముందు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి అక్టోబర్ రెండవ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందుకు ప్రత్యేక జిఓ ను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ జీఓ ను విపక్షాలు, బిసి సంఘాలు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఇప్పటికే జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలవారీగా జనాభా, అక్కడున్న కులాలు, రిజర్వేషన్లను బహిరంగంగా ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అమె డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా ఎన్నికలు నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో అనుకూల రిజర్వేషన్‌లను అమలు పరిచే అవకాశముంటుందంటున్నారు. దీంతో బిసీ రిజర్వేషన్ విషయంలో ప్రత్యేక జిఓ విడుదల చేయాలా లేక పార్టీ పరంగానే అమలు పర్చాలా అన్న ఆలోచనలో పడింది కాంగ్రెస్. ఒకవేళ పార్టీపరంగానే అమలు పరిస్తే ప్రజలకిచ్చిన మాటను చట్టపరంగా అమలు చేయలేకపోయారన్న విమర్శలకు అవకాశం ఏర్పడుతుందనుకుంటున్నారు. ఏదిఏమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతున్నదన్నది మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది.
———————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





