– ఎన్నికకు, మరో ఎన్నికకు మధ్య విరామం ఉండాలి
– ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాక ఒక ప్రాంతంలో ఎన్నికలు పూర్తయ్యాక మరో ప్రాంతంలో ఎన్నికలకు మధ్యలో రెండు రోజుల విరామం ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల సిబ్బందికి, భద్రతా బలగాలకు తగిన సమయం లభిస్తుందని, బందోబస్తు నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులతో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన రోజు ఫలితాలు సాయంత్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉన్నందున రెండు రోజుల విరామం అవసరమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల పట్ల, అలాగే అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీ సూచనలు, భద్రతా అంశాలపై చర్చ అనంతరం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రస్థాయి సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ అధికారులకు సూచించింది. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్ బిI2 అడిషనల్ డీజీపీ డి.ఎస్. చౌహాన్, మల్టీ జోన్ బి1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, శాంతిభద్రతల ఏఐజి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





