– మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలి
– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
– జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన వారికి సన్మానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగేందుకు ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం చేనేత శాఖపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చేనేతలకు అమలవుతున్న వివిధ పథకాల అమలు గురించి మంత్రికి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుండి వచ్చే సంవత్సరానికి సంబంధించి వారికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ లోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలని, ఇప్పటికే ఆర్ఢర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మం్రతి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. టెస్కో నుండి సంఘాలకు వస్త్రాల ఉత్పత్తికి వర్క్ ఆర్డర్లను వెనువెంటనే అందజేసి సకాలంలో వస్త్రాల ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేనేతలకు సంవత్సరం పొడవునా పని కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అందచేసే మహిళాశక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని, ఉత్పత్తి త్వరితగతిన పూర్తి చేయడానికి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి, చేనేత కార్మికుల ఖాతాలలో వెంటనే నిధులు జమ చేయాలన్నారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి లాభాల బాటలో నడిపించడానికి తగు చర్యలు తీసుకోవాలని, నష్టాలలో ఉన్న టెస్కో షోరూంలను లాభాలలో ఉన్న షోరూంలలో విలీనం చేయాలని, వేములవాడ నూలు డిపో ద్వారా నేత కార్మికులకు అవసరం మేరకు నూలు అందుబాటులో ఉంచాలని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి)ని హైద్రాబాద్ నుండి యాదాద్రి జిల్లా పోచంపల్లిలో శాశ్వత ప్రాతిపదికన సంవత్సరంలోగా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



