నిలువెత్తు నిర్లక్ష్యం తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

  • వరుస అగ్ని  ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేని ప్రభుత్వం 

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం – జి. మేడపాడు మధ్యన ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మంది చనిపోయినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల గ్రామాలను సైతం పొగ కమ్మేసింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు,  మరోవైపు పేలుడు ధాటికి మృతదేహాలు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు, కాళ్లు, చేతులూ పంటపొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు ధాటికి సమీపంలోని నివాసాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ప్రమాద సమయంలో 20 మంది వరకూ బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు సమాచారం. ఉదయం పని కోసం వెళ్లినవారు. ఇలా విగత జీవులుగా పొలాలలో పడి ఉండటం చూసి వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బతుకుదెరువు కోసం వెళ్లిన వారికి  బతుకే లేకుండా పోయింది.
పదిహేను మందికి పైగా  తొంభై శాతం కాలిన గాయాలతో  చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

రెండు సంవత్సరాల కిందట ఇదే కర్మాగారంలో  పేలుడు ధాటికి పదిమంది చనిపోయారు.  2024 నుంచి  ఇలాంటి ప్రమాదాలు  ఎనిమిదికి పైగా జరిగినా  ప్రభుత్వం నుంచి చలనం లేదు.  2024 ఆగస్టులో  ఎనిమిది, 2024 డిసెంబర్ లో తిరుపతి లో అనధికార గోడౌన్ లో   ముగ్గురు, గత సంవత్సరం  అచ్యుతాపురం  ఫార్మా కంపెనీలో ఆగస్టు 2024 లో జరిగిన పేలుళ్లలో 17 మంది, తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి అసంఘటిత రంగ కార్మికులు మరణిస్తున్నా ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. దేశంలో  పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురాకుండా, అసంఘటిత రంగంలో పనిచేసే  కార్మికులకు మెరుగైన వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద వహించక పోవడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మృతుల కుటుంబాలకు  ఇన్సూరెన్స్ , ఎక్స్గ్రేషియా , కాంపెన్సేషన్ దొరకడం లేదు.  పరిశ్రమల భద్రత కోసం అలాగే పది మంది కంటే ఎక్కువ కార్మికులు పనిచేసే చోట బలమైన రెగ్యూలేటరీ వ్యవస్థను రూపొందించాలి.  ప్రస్తుతమున్న రెగ్యులేటరీ  వ్యవస్థ ఎందుకూ పనికి రాకుండా పోయింది . నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలి,  ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్‌ పార్టీ తనిఖీలు ఉండడంలేదు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా చూడాలి అలాగే జనావాసాలలో  పరిశ్రమలు, గోదాములు, రద్దీ ప్రదేశాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిశ్రమల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 పారిశ్రామిక ప్రమాదాలు, గోదాములు, గుజరీ, తుక్కు వ్యాపార సముదాయాలల్లో  నివారణ చర్యలపై  ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించక ఏండ్లు గడుస్తుంది.  ప్రమాదాలు జరిగిన తర్వాత పనికి మాలిన సెక్షన్లు విధించి యజమానులు బయటకు వేస్తున్నారు తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రతి నెల పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశంపై విస్తృతంగా చర్చించి నివారణోపాయాలు వెదకాలి. కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకువచ్చి, పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ పటిష్టం చేయాలి. దాదాపు డెబ్భై శాతం వాణిజ్య సముదాయాలు, షాపులు, గోదాములలో ఫైర్ ఎక్సటెంగ్విషర్లు ఉండటం లేదు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను హై రిస్క్ జోన్లను గుర్తించాలి.  ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలు ఇండస్ట్రియల్  అట్లాసులో పొందుపరచాలి.  పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలుండాలి.  పరిశ్రమలు కాంప్లియన్స్‌ (సమ్మతి) నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలి.

స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని ఇండస్ట్రియల్, గోదాముల  సేఫ్టీ సంఘంలో బాద్యులుగా చేర్చాలి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలి. థర్డ్‌ పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి. ఇప్పుడు జరిగిన   దుర్ఘటనలో నిరోధకాలు ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడంవల్లే ఈ సమస్య వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితిలేదు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.

పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు
దేశంలోని  పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌(ప్రత్యేక తనిఖీ) నిర్వహించి,  ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్, బాయిలర్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఆర్వో, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారి సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని రూపొందించాలి. బాయిలర్స్ విభాగంలో, పరిశ్రమల శాఖ లో, అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. పరిశ్రమల్లో వంద రోజుల కొకసారి  స్పెషల్‌ డ్రైవ్‌ను పూర్తి చేసి, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మరియు ప్రజల కొరకు పోర్టల్ లో ఉండాలి. విష, ప్రమాదకర రసాయనాల తయారీ పరిశ్రమలు , ప్రమాదకర విష పదార్థాలు నిల్వ చేసే పరిశ్రమలు. .పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను నిల్వ చేసి, వాటిని తయారు చేసే పరిశ్రమలు  విభాగాలుగా వర్గీకరించి  పరిశ్రమల్లో, పని చేసే చోటు లో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలి, జిల్లా స్థాయి కమిటీలు రూపొందించుకొని  విధిగా తనిఖీ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *