3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ కీలకం

– దేశ జీడీపీలో మన వాటా పెంచేందుకే తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం
– బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం రెండేళ్లలోనే (డిసెంబర్ 2023-జనవరి 2026) రూ.73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, లక్ష ఉద్యోగాలను సృష్టించామని వివరించారు. హైటెక్స్‌లో ‘బయో ఏషియా 2026’ సదస్సులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ 2047- బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం పేరిట బుధవారం నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్ ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో‘తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం చుట్టామన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణ నెక్స్ట్- జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026-2030), తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్, 1బయో ఇంక్యూబేటర్, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ఫార్మా విలేజెస్, తెలంగాణ లైఫ్ సైన్సెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,000కుపైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు, ఎగుమతుల్లో అయిదో వంతు వాటా తెలంగాణదే కావడం మనకు గర్వకారణమని అన్నారు. ఈ ఏడాది సదస్సులో సనోఫీ, ఒపెల్లా, వ్యాక్సిండో యానిమల్ హెల్త్, ట్రెడెన్స్, ఆరఎక్స్ ప్రొపెల్లెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకT ముందుకొచ్చాయన్నారు. బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే తదితర దేశాల నిపుణులతో లైఫ్ సైన్సెస్ రంగంలో రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం అయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు. బయో ఎకానమీ రంగంలో మూడో అతిపెద్ద శక్తిగా ఎదగడానికి భారత్‌కు ఉన్న అవకాశాలు, తెలంగాణ పాత్రపై చర్చించి ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో కలిసి ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈసారి ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రతినిధులతోపాటు దేశవిదేశాల నుంచి 4,394మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాల కోసం నాలుగువేలకుపైగా అత్యున్నతస్థాయి బిజినెస్ టూ బిజినెస్(బీ2బీ) సమావేశాలకు ఈ ఏడాది సదస్సు వేదికగా నిలిచిం<ని శ్రీధర్‌బాబు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *