– ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో
– ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: వెన్యూ వ్యవస్ధను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలందించడానికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవో, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్నిబట్టి నాలుగు నుంచి ఆరుమంది వరకు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఈనెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని, ఆ తర్వాత 28, 29 తేదీల్లో జెఎన్‌టియు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని, ఆగస్టు 12న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్దులకు 40 రోజులపాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని తెలిపారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావలన్న లక్ష్యంతో లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా పదివేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో తొలి విడతలో 7వేల మందికి 33 కేంద్రాల్లో మే 26నుంచి శిక్షణ ప్రారంభించామని, ఈనెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తవుతుందని, మిగిలిన మూడువేల మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. గత పదేళ్ళలో ఈ విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమిస్తున్నామని, ఇందుకోసం వీఆర్వో, వీఆర్ ఎలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అర్హత పరీక్ష నిర్వహించగా 3,554 మంది ఎంపికయ్యారని తెలిపారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్ధన మేరకు ఈనెల 27న మరోసారి వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి
గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలలో ప్రయోగాత్మకంగా రీ సర్వేను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. పైలట్ గ్రామాలైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్‌లో 422 ఎకరాలు, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామంలో 626 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడలోని 845 ఎకరాలు ,ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్ నగర్‌లో 593 ఎకరాలలో మొత్తం ఐదు గ్రామాల్లోని 2988 ఎకరాలలో చిన్న వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే క్షేత్రస్ధాయిలో భౌతికంగా సర్వే పూర్తిచేశామన్నారు. దీనివల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు





