– అభినందనలు తెలిపిన కిట్స్ వరంగల్ యాజమాన్యం
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) వరంగల్‌లో గ్రంథాలయ అధికారిగా సేవలందిస్తున్న డాక్టర్ కోమల్ల ఇంద్రసేనారెడ్డి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డును అందుకున్నారు. మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ చెన్నై అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.నిత్యానందం చేతుల మీదుగా చెన్నై అన్నా శతాబ్ది గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఎస్సార్ రంగనాథన్ 133వ జయంతి సందర్భంగా ఈ అవార్డును అందుకున్నారు. డాక్టర్ ఇంద్రసేనారెడ్డి రెండు దశాబ్దాలుగా విద్యా సంస్థలలో ఆధునిక గ్రంథాలయాల అభివృద్ధి, డిజిటల్ లైబ్రరీల స్థాపన, విద్యార్థులకు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా విజ్ఞాన సముపార్జనలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. కిట్స్‌లో ఆయన ప్రస్తుత సేవలతో పాటు, దేశవ్యాప్తంగా లైబ్రరీ ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లలోనూ చురుకైన భాగస్వామిగా ఉన్నారు. పరిశోధన, అధ్యయనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో రచనలు సమర్పించిన డాక్టర్ ఇంద్రసేనారెడ్డి రెడ్డి విద్యా రంగానికి ఎనలేని సేవలందించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ తాను పనిచేస్తున్న కిట్స్ వరంగల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పాతికేళ్ల ప్రయాణంలో సాంప్రదాయ గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మార్చే ప్రయత్నాలు చేశామని, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు ఉపయోగపడేలా సమాచార వనరులను సమర్థవంతంగా అందించే విధానాలను అభివృద్ధి చేశామని చెప్పారు. ఇవన్నీ ఒంటరిగా సాధ్యం కావని, ఇది తమ బృందం కృషికి, సంస్థ మద్దతుకు ఫలితమని తెలిపారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యారంగంలో విజ్ఞానం పంచే మార్గాల్లో కొనసాగాలని, గ్రంథాలయాన్ని కేవలం పుస్తకాల గదిగా కాకుండా ఒక జీవితమైన విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కొనసాగుతామని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అడిషనల్ సెక్రెటరీ వి.సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ కె.అశోక రెడ్డి, రిజిస్ట్రార్ ఎం.కోమల్ రెడ్డి, డీన్ అకడమిక్ వేణుమాధవ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి.రమేష్ రెడ్డి, లైబ్రరీ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బి.రమాదేవి, గ్రంథాలయ సిబ్బంది, అధ్యాపకవర్గం, విద్యార్థులు, సిబ్బంది ఇంద్రసేనారెడ్డిని అభినందించారు. ఆయన గొప్ప గౌరవం పొందడం వల్ల గ్రంధాలయ నిర్వహణలో తమ కాలేజీకి జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




