– 17న పెరేడ్ గ్రౌండ్‌లో కార్యక్రమంపై సన్నాహక సమావేశం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న నిర్వహించేందుకు బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం శనివారం జరిగింది. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల కోసం సమగ్ర ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహావిష్కరణ, ఇతర కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరాకరిస్తూ వచ్చాయని రామచందర్‌రావు విమర్శించారు. ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అనేక పోరాటాలు చేస్తూ వస్తోందని, రాష్ట్రం విస్మరించినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దిన వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేస్తారన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాట యోధుల గాథలను, ఉద్యమ కథలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారని, పరేడ్ గ్రౌండ్ పక్కనున్న కంటోన్మెంట్ పార్కులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ చేయనున్నట్లు రామచందర్‌రావు తెలిపారు. పలువురు సమరయోధులను సన్మానించనున్నామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




