– రిటైర్డ్ ఉద్యోగులను వేదనకు గురిచేయడం న్యాయమా?
– కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రిటైర్ అయ్యి రెండేళ్లయినా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారంటూ వారి చావులకు మీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా? ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ.. జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదని ఆయన అన్నారు. ముక్కు మొఖం తెలియని వృద్దులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయమున్న తెలంగాణ సమాజం మనదని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. తక్షణమే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వారి బకాయిలన్నీ చెల్లించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనుకాడబోనని బండి సంజయ్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




