వ‌రంగ‌ల్ కోటలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాలి

– రికార్డులు స‌రిచేసి పురావ‌స్తు శాఖ భూములుగా పేర్కొనాలి
– సీఎం కు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి లేఖ‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః వ‌రంగ‌ల్‌ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించడం, ఆ భూముల్లోని అక్రమ నిర్మాణాలను, ఆక్రమణదారులను తొలగించడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆర్కియాల‌జికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంద‌ని తెలిపారు. దీనికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలను చేప‌ట్ట‌డం చట్టరీత్యా నేరమని, వెంటనే ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలని కోరుతూ ఏఎస్ఐ అధికారులు ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏఎస్ఐ ఐధికారులు 2022 న‌వంబ‌ర్ 4న, అలాగే. ఇటీవల 2025 డిసెంబ‌ర్ 1న వరంగల్ జిల్లా కలెక్టరుకు లేఖలు రాసినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించి, కోట భూములను పరిరక్షించటానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అంతేకాక రెవెన్యూ రికార్డులలో కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవి అని కాకుండా ప్రభుత్వం అని పేర్కొన‌డంతో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో పురావస్తు శాఖకు అడ్డంకులు ఎదురవుతున్నాయ‌ని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో కోట భూములను పరిశీలించాలి

ఆక్రమణలు మరింత పెరగకుండా, కోట భూములు పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించేందుకు త‌మ‌తో కలిసి క్షేత్రస్థాయిలో కోట భూములను పరిశీలించాలని సంబంధిత అధికారులకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరుతూ గ‌త అక్టోబ‌ర్ 15న ఏఎస్ఐ అధికారులు వరంగల్ జిల్లా కలెక్టరుకు లేఖ రాశారని తెలిపారు. కొంద‌రు వ్యక్తులు కొత్త నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఇటీవల కోట మట్టి గోడలోని కొంత భాగాన్ని ఆక్రమించారని సీఎం దృష్టికి తెచ్చారు.  కోట భూముల్లో చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించడంలో తగిన సహకారాన్ని అందించి పురావస్తు శాఖ చట్టం ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్ఐ అధికారులు డ‌సెంబ‌ఠ్ 3న జిల్లా కలెక్టరుకు మరో లేఖ రాశారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 2025 నవంబర్‌లో తాను వరంగల్‌లో పర్యటించినప్పుడు ఏఎస్ఐ అధికారులు ఈ విషయాలన్నింటినీ త‌న‌ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కావున‌ మీరు ప్రత్యేక చొరవ తీసుకుని వరంగల్ కోట పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించడం, ఆక్రమణకు గురైన కోట భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి తిరిగి ఏఎస్ఐకి స్వాధీనం చేయడం, ఆక్రమణదారుల మీద కఠిన చర్యలు తీసుకోవడం, పురావస్తు శాఖ చట్టం ప్రకారం వరంగల్ కోట భూములను ఏఎస్ కి చెందినవిగా గుర్తించి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది భూ ఆక్రమణ సమస్య పరిష్కరించడమ‌నే అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని, చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణలో ఏఎస్ఐకి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కేంద్రం తరఫున కోరుతున్నానని కిష‌న్‌రెడ్డి ఆ లేఖ‌లో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *