“విచిత్రం ఏమిటంటే… పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసర్ల రాజు తన భైరవుని సుస్తీ చేసినప్పుడు త్వరగా కోలుకుంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తాననని మొక్కుకున్నారట. ఆ కుక్క త్వరగా కోలుకోవడంతో ఆయన బంగారం మొక్కు సమర్పించుకున్నారు. కాకపోతే హీరోయిన్ టీనా మాదిరిగా ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇష్యూ ఏదైనా సరే, రచ్చ చేయడమే.. ప్రజెంట్ సోషల్ మీడియా పని కదా. తను ప్రేమించే పెట్ బాగుండాలని కోరుకుంటే అందులో దేవతల మీద విశ్వాసమే కదా కనిపించేది..!”
ఆపత్కాలంలో కనిపించే మనుషులకంటే కనిపించని దేవుళ్ళకు మొక్కుకోవడం మనుషుల నైజం. కుటుంబ సభ్యులు జబ్బుపడినప్పుడు, కొత్తగా వ్యాపారం ప్రారంభించినపుడు, వ్యాపారంలో లాభాలు కొరకు, మంచి ఉద్యోగం దొరకాలని, మంచి భర్త రావాలని, మంచి భార్య దొరకాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని..ఇలా రకరకాలుగా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా మొక్కుకునేది మాత్రం దేవుళ్లకే. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వారి మతాలు, సంప్రదాయాలు ప్రకారం మనుషులు దేవుళ్ళకు మొక్కుతుంటారు. వారి కోరికలు తీరిన వెంటనే మొక్కలు చెల్లించుకుంటారు. ఇది అనాదిగా వస్తున్నది. నమ్మకం పునాదిగా ఈ దైవిక విషయాలను కొందరు ఈ మధ్య తమకు ఇష్టం వచ్చినట్లు భాష్యం చెపుతున్నారు. సోషల్ మీడియా లో అయితే చెప్పనక్కర్లేదు. నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు… ఇలా చేయాలి అలా చేయాలి అని వీడియోల రూపంలో అక్షరాల రూపంలో… సంగ్జల రూపంలో చెప్తున్నారు. కొందరైతే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయి…ఫలానా వాళ్ళు ఇలా చేశారు…అలా చేయకూడదు. ఇది తప్పు..అది తప్పు అంటూ అడగకుండానే ఉచిత సలహాలు ఇస్తుంటారు. కొంత వరకు ఒకే.. తనకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడం లోనే వచ్చింది పెద్ద చిక్కు.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే… ఆసియాలోనే అతి పెద్ద జాతర అయిన సమ్మక్క – సారక్క జాతరలో కొందరు తమ పెంపుడు జంతువులకు నిలువెత్తు బంగారం ( బెల్లం) తూకం వేయించి అమ్మ వార్లకు మొక్కలు చెల్లిస్తున్నారు. ఇది అపచారం .. గిరిజన సంప్రదాయాలకు విరుద్ధం…వనదేవతలను అవమానిస్తున్నారు..అంటూ విమర్శించే వారు కొందరయితే.. అభినందించే వారు మరికొందరు. కుక్కలను, పిల్లులను సొంత పిల్లల్లానే పెంచుకుంటున్నారు కదా.. వాటి ఆరోగ్య సమస్య వస్తె.. మొక్కుకోవడం ఏళ్ళతరబడి ఉంది. పాడిగేదెలు, ఆవులకు సుస్తీ చేసినప్పుడు కూడా వారు నమ్మే దేవుళ్ళకు మొక్కేవారు. ఇప్పుడూ మొక్కుతున్నారు. టాలీవుడ్ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్క నిలువెత్తు బంగారం సమ్మక్క సారలమ్మ జాతరలో తూకం వేయించి అమ్మ వారికి సమర్పించారు.
ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది..అప్పుడు స్టార్ట్ అయింది ఆమెపై ట్రోలింగ్… ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు, విమర్శించే వాళ్ళు మెసేజ్ లతో నటి శ్రావ్య సోషల్ మీడియా హ్యాండిల్ నిండిపోతున్నాయి. విచిత్రం ఏమిటంటే… పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసర్ల రాజు తన భైరవుని సుస్తీ చేసినప్పుడు త్వరగా కోలుకుంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తాననని మొక్కుకున్నారట. ఆ కుక్క త్వరగా కోలుకోవడంతో ఆయన బంగారం మొక్కు సమర్పించుకున్నారు. కాకపోతే హీరోయిన్ టీనా మాదిరిగా ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇష్యూ ఏదైనా సరే, రచ్చ చేయడమే.. ప్రజెంట్ సోషల్ మీడియా పని కదా. తను ప్రేమించే పెట్ బాగుండాలని కోరుకుంటే అందులో దేవతల మీద విశ్వాసమే కదా కనిపించేది..!
గుళ్ల దగ్గర కోతుల్ని ఎవరూ కొట్టరు… గానుగాపూర్ లో ఆవులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతాయి, ఎవరూ కొట్టరు. కుక్కలయితే గుడి లోపలకు కూడా వస్తుంటాయి… దత్తాత్రేయుడి అనుచరగణంగానే వాటినీ భావిస్తారు భక్తులు. ఆవులకు అరటి పండ్లు తినిపిస్తుంటారు కూడా. అసలు జంతురూపాల్ని కూడా పూజించేది హిందూ ఆధ్యాత్మిక ధర్మం… దశావతారాల్లో మత్స్యం, వరాహం, సింహం తదితర కొన్ని అవతారాలతో పాటు గరుత్మంతుడు, హనుమంతుడు, గణేషుడు తదితర దేవుళ్లు కూడా మన దేవుళ్లే అన్న విషయం ట్రోలర్స్ లో ఎంత మందికి తెలుసు..? ఇంకో విషయం చెప్పుకోవాలి మేడారంకు వెళ్తున్న భక్తులు మేకలు, కోళ్లను తమ వెంట తీసుకెళ్తారు బలి ఇవ్వడానికి. సమ్మక్కను గద్దె పైకి తీసుకు వచ్చే సమయంలో కొందరు భక్తులు కోళ్లను గాల్లోకి ఎగురవేసి… తమ చేతుల్లోని కత్తులు, కొడవళ్ళతో నరుకుతారు (ఎదుర్కొల్లు) అమ్మ వారి మొక్కలు తీర్చుకోవటానికి. భీతిల్లిపోయే దృశ్యం అది. మందు (సారాయి) లేదా కళ్ళు సాక పోస్తారు. దీనికి భిన్నంగా కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కల నిలువెత్తు బంగారం తూకం వేసి వన దేవతల మొక్కు తీర్చుకుంటే అభించాల్సిన విషయమే కదా..
వనదేవతల పై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం వారిని వందల మైళ్ళ దూరం నడిపిస్తుంది.
ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాలీలు, వ్యాన్ లు మినీ బస్ లు, ఆర్టీసీ బస్సులు ఇలా అందుబాటులో ఉండే వాహనాల్లో అడవి బాట పట్టే సమ్మ సారలమ్మ ల ప్రతి రూపాలయిన గద్దెలను దర్శించి జీవితాలను సార్థకం చేసుకుంటారు. సమ్మక్క కనిపించింది… అంతర్థానం అయింది అడవిలోనే. జగిత్యాల సమీపంలోని పొలాస వద్ద అడవిలో మేడ రాజుకు పసిపాపరూపంలో కనిపించింది. పాపకు కాపలాగా పులులు, సింహాలు కనిపించాయట. పెద్దయ్యాక మేడారంకు వెళ్లిన సమ్మక్క కుటుంబం కరువు కాటకాలతో అల్లాడుతుండటం చూసి చలించిపోయి.. కప్పం చెల్లించలేమని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కు మేడారం సామంత రాజు పగిడిద్ద రాజు ద్వారా చెప్పించిందట.
కాకతీయ సైన్యం మేడారంపై దండెత్తితే… పగిడిద్ద రాజుకు మద్దతుగా గెరిల్లా యుద్ధం చేయడం, ఆ పోరులో సమ్మక్క కుటుంబ సభ్యులు వీర మరణం చెందడం.. గాయాల పాలయిన సమ్మక్క చిలుకల గుట్టలో అంతర్థానం అయి కుంకుమ భరిణె రూపంలో వెలిసిందని చరిత్ర చెప్తోంది. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క కు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు మొదలై మూడు రోజుల పాటు జరిగే జాతరలో వన దేవతలకు మొక్కలు చెల్లిస్తున్నారు. ఈ విషయంలో మనుషులు, పశుపక్ష్యాదులకు వేర్వేరు నిబంధనలు, నియమాలు ఎందుకు..? కులాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు వేరయినా… దేవుళ్ళను కోరేది ఒక్కటేగా..మమ్మల్ని చల్లగా చూడమని…ఊరూ వాడా, చెట్టు, చేమా, పుట్టా గుట్టా బాగుండాలని కోరుకుంటాం కదా.. కుత్సిత బుద్ధితో అచంచల భక్తుల విశ్వాసాన్ని హేళన చేయడం తగదు. సర్వజనం చల్లంగుండాలని మనమూ వన దేవతలను కోరుకుందాం.
-వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్





