మామిడి మొక్క నాటి న మంత్రి సీతక్క
స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం
మంగపేట, ప్రజాతంత్ర, జులై 7: సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే ప్రాణవాయువు పెరుగుతుంది.. గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.. అందుకే ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు. పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో మామిడి మొక్కను నాటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఏడాది ఏడు కోట్ల మొక్కలను నాటాలని తమ శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు వెల్లడిరచారు. మొక్కలు నాటేందుకు ఇప్పటికే రెండున్నర కోట్ల గుంతులు తీసి సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. అయితే ఈ దఫా పచ్చదనం కార్యక్రమంలో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడిరచారు. మొత్తం 22 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటు పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేసి ఇప్పటికే 19,066 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 2083 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తిచేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 73.23 లక్షల మొక్కలు నాటినట్టు, ఇది మొత్తం లక్ష్యంలో 17 శాతం అని అధికారులు మంత్రికి వివరించారు.




