ప్రపంచవ్యాప్తంగా 155 దేశాలు తమ పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించినప్పటికీ, భూమి, గాలి, నీరు, రసాయన కాలుష్యం వంటి “పర్యావరణ ప్రమాదాల” వల్ల 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో మార్పులు ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు తెస్తున్నాయి. గత పదేళ్లుగా వాతావరణంలో వేడి పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం వల్ల భూతాపం పెరుగుతోంది.
మానవాళి అభివృద్ధిలో పర్యావరణం కీలకపాత్ర పోషిస్తుంది. పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే, మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ అంశాలన్నింటినీ పర్యావరణం అంటారు. పర్యావరణ ఆరోగ్యం అనేది ప్రజారోగ్యంలోని అతిపెద్ద రంగాలలో ఒకటి. ఒక ప్రాంతంలోని భౌతిక, రసాయన, సాంస్కృతిక వాతావరణం, ఆ ప్రాంత పర్యావరణ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని కాలుష్య స్థాయి, జీవావరణ వైవిధ్యం, పరిశుభ్రమైన తాగునీరు లభ్యత, పారిశుద్ధ్య పరిస్థితులు, వ్యవసాయ ఉత్పాదకత వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణ సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.6 కోట్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. అంతేకాక, వందకు పైగా అనారోగ్యాలు పర్యావరణ ఆరోగ్య సమస్యలతో నేరుగా ముడిపడి ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 155 దేశాలు తమ పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించినప్పటికీ, భూమి, గాలి, నీరు, రసాయన కాలుష్యం వంటి “పర్యావరణ ప్రమాదాల” వల్ల 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో మార్పులు ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు తెస్తున్నాయి. గత పదేళ్లుగా వాతావరణంలో వేడి పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం వల్ల భూతాపం పెరుగుతోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. అడవులు తగలబడటం, అకాల వరదలు, తుఫానులు సాధారణం అయ్యాయి. వాతావరణ మార్పులు సూక్ష్మజీవుల మనుగడకు, వైరస్‌ల వ్యాప్తికి కారణమవుతున్నాయి.
పర్యావరణంలో సవాళ్లు:
వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరగడం, అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడం, అలాగే ఆర్కిటిక్ ప్రాంతాలలో శాశ్వత మంచు కరగడం వంటివి పర్యావరణానికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ప్రపంచ వన్యప్రాణి నిధి ఇటీవల ఒక నివేదికలో క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల జనాభా 1970 నుంచి 2016 మధ్య సగటున 68 శాతం క్షీణించాయని తెలిపింది. ఇది జీవవైవిధ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే పట్టణీకరణ, పంటలు, పశువుల పెంపకం, కాగితాల తయారీ కోసం ప్రతి సంవత్సరం కోటి హెక్టార్లకు పైగా చెట్లను నరుకుతున్నారు. దీనివల్ల అటవీ నిర్మూలన జరుగుతోంది.
ప్రపంచంలోని అతిపెద్ద పర్యావరణ సమస్యలలో వాయు కాలుష్యం ఒకటి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 42 లక్షల నుంచి 70 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి పది మందిలో తొమ్మిది మంది అధిక కాలుష్య కారకాలను కలిగి ఉన్న గాలిని పీల్చుకుంటున్నారు. మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, భూమిపై సముద్ర మట్టం సంవత్సరానికి సగటున 3.2 మి.మీ పెరుగుతోంది. ఈ శతాబ్దం చివరి నాటికి అది దాదాపు 0.7 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదల వల్ల సముద్ర తీరప్రాంతాలు ముంపునకు గురై, సుమారు 34 కోట్ల నుంచి 48 కోట్ల మంది సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది.
ప్రతి గంటకు 300 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో అడవులు నరికివేయబడుతున్నాయి. ఇలాగే కొనసాగితే, 2030 నాటికి ఇప్పుడున్న అడవులలో కేవలం 10% మాత్రమే మిగిలి ఉండవచ్చు. మహాసముద్రాలు భూమి యొక్క వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌లో 30% గ్రహిస్తాయి. అధిక కార్బన్ డయాక్సైడ్ వల్ల సముద్ర జలాలు ఆమ్లీకరణకు గురవుతున్నాయి. దీనివల్ల 2050 నాటికి పగడపు దిబ్బలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన నేలలో కనీసం 3 నుంచి 6% సేంద్రీయ పదార్థం ఉంటుంది. కానీ ప్రపంచంలో చాలా చోట్ల ఇది ఉండాల్సిన దాని కంటే చాలా తక్కువగా ఉంది. ఇది నేల కోతకు సంకేతం.
పరిష్కారాలు:
మన దేశంలో పర్యావరణ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వానికి, పరిశ్రమలు, ప్రజలు కలిసి కృషి చేయాలి. ఈ పని కోసం అనేక కోణాల నుండి ప్రయత్నాలు అవసరం. ఈ ప్రయత్నాలు కొన్ని ముఖ్యమైన రంగాలలో చేపడితే మంచి ఫలితాలు వస్తాయి.
విధానాలు– పాలన:
పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కొత్త నియమాలను రూపొందించాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి. గాలి, నీటి కాలుష్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, జీవవైవిధ్యం వంటి విషయాలకు సంబంధించిన నియమాలను మరింత పటిష్టం చేయాలి. పర్యావరణ పనితీరు సూచిక వంటి సంస్థల నుండి లభించిన డేటాను ఉపయోగించుకుని కాలుష్యానికి సంబంధించిన బలహీనమైన ప్రాంతాలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలను కనుగొనాలి.
శక్తి– వాతావరణ చర్యలు:
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని వేగవంతం చేయాలి. సౌర శక్తి, పవన శక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటివాటిలో పెట్టుబడులు పెంచడం చాలా ముఖ్యం. ‘నేషనల్ సోలార్ మిషన్’, ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బాగా పనిచేస్తున్నాయి. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, ‘ఉజాల’ వంటి పథకాలను ప్రోత్సహించాలి. బొగ్గు వంటి ఇంధనాల వాడకాన్ని దశలవారీగా తగ్గించి, దాని స్థానంలో కాలుష్య రహిత సాంకేతికతను ప్రోత్సహించాలి.
కాలుష్య నియంత్రణ:
గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్’ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. దీనిలో పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడం, ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడాన్ని నివారించడం వంటి చర్యలు ఉంటాయి. నదుల కాలుష్యాన్ని తగ్గించడానికి ‘నమామి గంగే’ వంటి పథకాలను విస్తృతం చేయాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించడం, వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించడం, చెరువులు, నదుల వంటి నీటి వనరులను కాపాడటం కూడా అవసరం. వ్యర్థ పదార్థాల నిర్వహణకు ‘ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ’ వంటి విధానాలను కచ్చితంగా అమలు చేయాలి.
జీవవైవిధ్యం – అడవుల సంరక్షణ:
‘నగర్ వన్ యోజన’ వంటి పథకాల ద్వారా పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంచాలి. అలాగే, ‘మిష్టీ’ వంటి కార్యక్రమాలతో తీర ప్రాంతాలలో మడ అడవులను కాపాడాలి. వ్యవసాయంలో పర్యావరణానికి హాని కలిగించని విధానాలను, అంటే సేంద్రీయ వ్యవసాయం, పంటల మార్పిడిని ప్రోత్సహించాలి. అడవులను, వాటిలోని జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ‘ప్రాజెక్ట్ టైగర్’, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ వంటి ప్రాజెక్టులను కొనసాగించాలి.
ప్రజలు, వ్యాపార సంస్థల పాత్ర:
పర్యావరణ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. వ్యర్థ పదార్థాలను వేరు చేయడం, నీటిని పొదుపుగా వాడటం, వినియోగాన్ని తగ్గించడం వంటి వాటిని ప్రోత్సహించాలి. కంపెనీలు కూడా పర్యావరణ హితమైన ఉత్పత్తి విధానాలను అవలంబించాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి, వ్యర్థాలను పునర్వినియోగం చేయడానికి సాంకేతికతను ఉపయోగించాలి. స్థానిక ప్రజలను పర్యావరణ పరిరక్షణలో భాగం చేయడం ద్వారా, ఈ ప్రయత్నాలు మరింత విజయవంతం అవుతాయి.

8247045230





