– సభల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః శాసనమండలి, శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని, సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని, పారదర్శకంగా, వేగంగా మంత్రులకు, సభ్యులకు సమాచారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మొదటి సమావేశ మందిరంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీనియర్ అధికారులతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. అత్యంత ప్రజాస్వామికంగా సభ నిర్వహిస్తూ ప్రజలకు, సభ్యులకు జవాబుదారీగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఉన్నందున అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశాలకు మంత్రులు చాలా సీరియస్ గా ప్రిపేర్ అయి వస్తున్నందున అధికారులు కూడా అందుకనుగుణంగా పూర్తి సమాచారంతో సభలు జరిగినన్ని రోజులు అందుబాటులో ఉండాలని తెలిపారు. సభ్యులు గొప్ప ఆశయాలు, లక్ష్యాలతో సభకు వస్తున్నారన్న విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలన్నారు. ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలన్న ఆలోచనలతో సభ్యులు ఉంటారు కాబట్టి అధికారులు అన్ని ప్రశ్నలకు పారదర్శకంగా, పూర్తి సమాచారంతో హాజరవ్వాలన్నారు. మంత్రులకు వెంటనే సమాచారం ఇచ్చి సభ ద్వారా సంతృప్తికర సమాధానాలు వెళ్లేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సభ జరిగే సమయంలో లైవ్ ప్రసారాల ద్వారా సభను రాష్ట్రంలోని ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్నవారు ఆసక్తిగా చూస్తారు.. బయట ప్రభుత్వం ఎంత విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నదో అదే తరహాలో సభలోనూ తన ప్రతిభను చూపాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఉభయ సభలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ధ్రువపరుచుకోకుండా మీడియాలో ఇష్టారీతిన ప్రచురణ లేదా ప్రసారం చేస్తే అది చట్టసభల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సమావేశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారంపై సమాచార శాఖ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
సభల గౌరవాన్ని పెంచేలా నిర్వహిద్దాం: మంత్రి శ్రీధర్ బాబు
చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచేలా ఉభయ సభలు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, అందుకు అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఉండాలని ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఉదయాన్నే మీడియాలో వచ్చిన వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే మంత్రులు సమాధానం ఇచ్చేందుకు అధికారులు పూర్తి సమాచారంతో సభలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జీరో అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు అవసరమైన సమాధానాలను అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధం చేయాలని, పెండింగ్ రిపోర్ట్స్, హామీలకు సంబంధించిన అంశాల పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. అసెంబ్లీ, కౌన్సిల్ కార్యదర్శులు ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ కార్యాలయంతో సమన్వయం చేసుకుంటే ఏవి ప్రాధాన్యం ఉన్న అంశాలు, ఏవి అప్రాధాన్యమైన అంశాలు వివరిస్తారని, అందుకనుగుణంగా అధికారులు వెనువెంటనే స్పందించాలన్నారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కౌన్సిల్ సెక్రటరీ నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి, సీనియర్ అధికారులు వికాస్ రాజ్, దాన కిషోర్, జయేష్ రంజన్, రఘునందన్ రావు, శ్రీధర్, నదీమ్ అహ్మద్, శైలజ రమా అయ్యర్, యోగితారానా, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



