శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

– స్పీకర్ తీర్పుపై కేంద్ర మంత్రి బండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపం.. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గుచేటని, కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదమని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో సంసారం చేస్తూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపులు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికే చేటు అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించింది నిజం కాదా అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలన్నారు. శాసన వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని, రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ కార్యాలయంలో బంధించాలని చూస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ స్వతంత్య్రంగా వ్యవహరించాలే తప్ప డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా వ్యవహరించకూడదన్నారు. పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదే అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేమన్నారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళతాం.. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉంది.. బెంగాల్‌లో అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఇదే తరహా తీర్పు ఇస్తే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కొట్టేసింది అని తెలిపారు. తెలంగాణలోనూ ఫిరాయింపులపై చెంప ఛళ్లుమనేలా న్యాయ వ్యవస్థ తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉందని బండి ఆశాభావం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *