కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

– మొబైల్ ఫోన్ల విషయంలో ఆరోపణలు నిరాధారం
– 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి
– లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13: అంగన్‌వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లీగల్ నోటీసు పంపించారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఈ నోటీసు పంపించారు. నోటీసులో అంగన్‌వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీజీటీఎస్) నిర్వహించిందని, కమిటీ నిర్ణయాల ప్రకారం సరఫరాకు ఒప్పందం చేసుకున్నారని, ఇందులో తన ప్రమేయం లేదని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం టెండర్ విలువ రూ.44.42 కోట్లే ఉన్నప్పటికీ రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇది పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణ అని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని, ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపారు. అంగన్‌వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకే టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు 48 గంటల్లో సోషల్ మీడియా పోస్టులను తొలగించి పార్టీ, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. అనంతరం ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క అంగన్‌వాడీలకు మొబైల్స్ కొనుగోలు విషయంలో బీఆరఎస్ పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం వల్లే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు తాను కేసీఆర్‌కు లీగల్ నోటీసు పంపించినట్టు గుర్తుచేశారు. ‘తప్పును పదిసార్లు చెబితే నిజం కాదు. రూ.44 కోట్ల టెండర్‌లో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదం’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడినప్పుడు తాను గట్టిగా సమాధానం ఇచ్చిన తరువాత తనపై దుష్ప్రచారం ప్రారంభమైందని ఆమె గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *