భట్టికి బీజేపీ చీఫ్‌ నోటీసులు

రోహిత్‌ వేముల కేసులో అనుచిత వ్యాఖ్యలు చేశారని..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: రోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంగళవారం లీగల్‌ నోటీసు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని రామచందర్‌రావు తరపు న్యాయవాది ఆ నోటీసుకు జత చేశారు. నాలుగు రోజుల క్రితం దిల్లీలో ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్‌ యూనివర్సిటీల స్థితిగతులపై భట్టి మాట్లాడుతూ హెచ్‌సీయూలో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావును ఎంపిక చేయడాన్ని తప్పుపడుతూ రోహిత్‌ వేముల హత్యకు కారకులైనవారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్‌గా రామచందర్‌రావు భట్టికి లీగల్‌ నోటీసులు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *