– పేదల సంక్షేమంపై వివరిస్తుంటే పట్టదా?
– బీఆర్ఎస్ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్
– ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని కోట్లయినా ఇస్తాం
– వారం వారం బిల్లుల చెల్లించడానికి సిద్ధం అన్న భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: పేదల సంక్షేమం గురించి అసెంబ్లీలో వివరిస్తుంటే వినడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మనసు లేదని, అందుకే బడ్జెట్‌పై సమాధానం వినకుండా సభ నుంచి పారిపోయారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రస్తుత ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటిచెప్పారు. గత పాలకులు మాయమాటలు చెప్పి, ప్రజల్లో భ్రమలు కల్పించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఓట్లు వేయించుకున్నారు. కానీ, పదేళ్ల అధికారంలో ఏ ఒక్క పేదవాడికీ ఇల్లు కట్టించి ఇవ్వకుండా వారిని గాలికి వదిలేశారని భట్టి విమర్శించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉన్నత లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అదే స్ఫూర్తితో నేడు తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. బడ్జెట్ ప్రతులను చింపి చెవిలో పెట్టుకుని సభ నుంచి వెళ్లిపోయిన బీఆరఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. పేదలు ఇల్లు కట్టుకుని ఆత్మగౌరవంతో బతకడం వారికి ఇష్టం లేనట్లుంది అని విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు తగ్గించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏకంగా రూ.22,500 కోట్లు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పనులు వేగవంతం చేసేందుకు గతంలోలాగా నెలలతరబడి వేచి చూడకుండా వారానికోసారి బిల్లులు చెల్లించేలా నిక్కచ్చిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇల్లు కట్టండి.. బిల్లు తీసుకోండి అనే నినాదంతో లబ్దిదారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల కోసం వెనకడుగు వేయలేదని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణం ఇంకా వేగవంతం కావాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు చెల్లించిన బిల్లులు రూ.5,000 కోట్లు దాటలేదని, ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిర్మాణాలు ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ఆశయంతో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉందని భట్టి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





