ఆయుధాలు వీడి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో చేరండి

– అజ్ఞాత మావోయిస్టుల‌కు డీజీపీ పిలుపు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్ వెంటనే హింస మార్గాన్ని విడిచిపెట్టి, ఆయుధాలు సమర్పించి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి చేరి సురక్షితమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం గడపాలని డీజీపీ శివ‌థ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఇచ్చిన పిలుపు మేరకు అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్లందరు తిరిగి వచ్చి జన జీవన స్రవంతిలో కలిసి, తమ కుటుంబ సభ్యులతో కలసి శాంతియుతమైన, సురక్షితమైన జీవితాన్ని గడపాలని కోరారు. గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ పోలీసుల నిరంతర, సమన్వయ కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన మొత్తం 721 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్,  తెలంగాణ,  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం సహా అన్ని రకాల ప్రయోజనాలు అందజేయబడినట్లు తెలిపారు. ప్రస్తుతం వీరంతా తమ కుటుంబాలతో కలిసి తమ స్వగ్రామాల్లో శాంతియుతంగా, గౌరవప్రదంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెంది, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వివిధ మావోయిస్టు నిర్మాణాల్లో పనిచేస్తున్న అజ్ఞాత కేడర్‌కు కూడా ఈ విజ్ఞప్తిని చేశారు. వీరిలో ముప్పాల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి,పుసునూరి నరహరి అలియాస్ సంతోష్,  వర్త శేఖర్ అలియాస్ మంగ్తు,  జోడే రత్న బాయి అలియాస్‌ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపి వున్నారు. తెలంగాణ పోలీసుల దృష్టికి వచ్చిన మేరకు, ముప్పాల్ల లక్ష్మణ రావు అలియాస్  గణపతి వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆయనను జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తూ, ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరపున  తగిన వైద్య చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చారు. పైన పేర్కొన్న తెలంగాణకు చెందిన, అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) కేడర్లు జనజీవన స్రవంతిలోకి వచ్చి తమ కుటుంబాలు, బంధువులను తిరిగి కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న పునరావాస అవకాశాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జన జీవన స్రవంతిలో కలిసే వారందరికీ భద్రత, గౌరవం మరియు కొత్త జీవితానికి అవసరమైన అన్ని సహాయాలను అందించడంలో తెలంగాణ పోలీసులు కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *