– దిల్లీలో ప్రాథమిక పాఠశాలల టీచర్ల సంఘం ధర్నా
న్యూదిల్లీ, నవంబర్ 24: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు వై.ఎస్.శర్మ డిమాండ్ చేశారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా జరిగింది. జాతీయ అధ్యక్షుడు బసవరాజు గురికర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాకు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మంది హాజరయ్యారు. ఉపాధ్యాయుల ఉద్యోగాలను కాపాడాలని, లేనిపక్షంలో ఫిబ్రవరిలో లక్షలమంది ఉపాధ్యాయులతో ‘చలో పార్లమెంటు’ను నిర్వహిస్తామని బసవరాజు, సెక్రటరీ జనరల్ కమలకాంత్ త్రిపాఠి, కోశాధికారి ఉమాశంకర్, జాతీయ కార్యదర్శి శర్మ, అన్ని రాష్ట్రాల టీచర్ల నేతలు పిలుపునిచ్చారు. ‘టెట్’ మినహాయింపునివ్వాలని, ఓల్డ్ పెన్షన్ పథకం (ఓపీఎస్)ను అన్ని రాష్ట్రాల టీచర్లకు వర్తింపచేయాలనే నినాదాలతో ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు, అన్ని రాష్ట్రాల ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఎమ్మెల్సీలు, తెలంగాణ రాష్ట్రం నుండి పి.విక్రంబాబు, మహీపాల్ రెడ్డి, రాఘవేందర్ తదితర నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




