అదుపులోనే శాంతిభద్రతలు

క్రైమ్‌ రేటును బాగా తగ్గించగలిగాం
– పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం
– ఫ్యూచర్‌ సిటీలో సమర్థంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ
– మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ కూడా సజావుగా నిర్వహించాం
– మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
– 2025 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ శివధర్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, ఇటీవలి మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా. శాంతియుతంగా జరిగేలా చూశామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. పోలీసు శాఖ 2025 వార్షిక నివేదికను డీజీపీ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది పండుగల బందోబస్తును పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ పటిష్ట భద్రతా చర్యలతో సజావుగా జరిగిందని, మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ కూడా దిగ్విజయంగా జరిగిందని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసులు సమర్థంగా పనిచేశారన్నారు. రాష్ట్రంలో మహిళా పోలీసు అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఐడీ చీఫ్‌, ఏసీబీ డీజీ చారుసిన్హా, పోలీస్‌ అకాడవిూ డైరెక్టర్‌ అభిలాష బిస్తా, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయల్‌, ఎస్‌ఐబీ ఐజీ సుమతి ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని స్పష్టం చేశారు. ఫీడ్‌ బ్యాక్‌ కోసం ఈ ఏడాది ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

సైబర్‌ నేరాలు తగ్గాయి

దేశంలో 41 శాతం సైబర్‌ నేరాలు పెరిగితే తెలంగాణలో 3 శాతం తగ్గాయన్నారు. ఈ ఏడాది 2.28 లక్షల కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 2.33శాతం క్రైమ్‌ రేట్‌ తగ్గిందని, నాలుగు కేసుల్లో మరణ శిక్షలు ఖరారు కాగా 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని వివరించారు. 144 పోక్సో కేసుల్లో 154మందికి శిక్షలు ఖరారయ్యాయని, అందులో ముగ్గురికి మరణ శిక్ష, 48మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని డీజీపీ పేర్కొన్నారు. డ్రగ్స్‌ కట్టడి కోసం ఈ ఏడాది ఈగల్‌ టీమ్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్‌ఫోన్లు ట్రేస్‌ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో దేశంలో రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 509మంది నక్సల్స్‌ లొంగిపోయారని, వారిలో 481మంది ఛత్తీస్‌గఢ్‌, 21 మంది తెలంగాణ, ఒకరు మహారాష్ట్ర, ఒకరు ఏపీ నక్సల్స్‌ ఉన్నారన్నారు. నాలుగు నేషనల్‌ లోక్‌ అదాలత్‌, ఒక స్పెషల్‌ అదాలత్‌ నిర్వహించామన్నారు. ఏడు లక్షల కేసులు లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్‌ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడిరచారు. ట్రావెల్‌ సేఫ్‌ పేరుతో సీఐడీ నూతన యాప్‌ తీసుకొచ్చిందని, మహిళలు, జర్నీ చేసే వారికి ఈ యాప్‌ చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టూరిస్ట్‌ పోలీసులను ఈ ఏడాది లాంచ్‌ చేశామన్నారు. 80 మందిని నియమించి టూరిస్ట్స్‌ ప్లేస్‌లో పోలీసులు ఎలా పని చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో మహిళల కోసం కమిటీలు ఏర్పాటు చేశామని, పోష్‌ యాక్ట్‌ను తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయబోతున్నామని.. ఇందులో 18 నుంచి 35 ఏళ్ళు లోపు ఉన్న వారు హాజరువుతారని తెలిపారు. టీజీ ఆర్టీసీ డ్రైవర్లకు ఈ ఏడాది పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా పరీక్ష నిర్వహించామన్నారు. నయీమ్‌ కేసు సీఐడీ విచారణలో ఉందని, ఈ కేసులో సీజ్‌ అయిన ని భూములు అమ్మాలని చాలామంది ప్రయత్నించారని, ఆ భూములు ఎవరూ కొనవద్దని, అమ్మవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

డ్రగ్స్‌ కేసులు పెరిగాయి..

డ్రగ్స్‌ కేసులు భారీగా పెరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం డ్రగ్స్‌ కేసులు పెరిగినట్లు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న నిందితులను ఈగల్‌ టీమ్‌ పట్టుకొస్తున్నదన్నారు. ఈగల్‌ టీమ్‌ ఈ ఏడాది రూ.173 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ చేసిందన్నారు. నమ్మక ద్రోహం కేసులు రాష్ట్రంలో 23 శాతం పెరిగాయన్నారు. ఐపీసీ సెక్షన్‌ కింద కేసులు 7.83 శాతం పెరిగాయని, అలాగే మహిళలపై దాడుల కేసులు 2.90 శాతం పెరిగాయని చెప్పారు. 248 మంది మహిళలు హత్యలకు గురయ్యారని తెలిపారు.

రేప్‌, కిడ్నాప్‌ కేసులు తగ్గాయి

రేప్‌ కేసులు 13శాతం, కిడ్నాప్‌లు 10శాతం, వేధింపుల కేసులు 9శాతం తగ్గాయని అన్నారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 23శాతం రికవరీ చేసిందని, రూ.246 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 25,500మంది బాధితులకు రూ.159 కోట్లు రిఫండ్‌ చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *