రాష్ట్రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌లు

– బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై చర్యలు తీసుకోవాలి
– డీజీపీకి బీజేపీ నాయకుల ఫిర్యాదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డి పట్టణం, నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రాంతాల్లో జరిగిన మూడు తీవ్రమైన సంఘటనలను ప్రస్తావిస్తూ ఇవన్నీ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయ‌నే దానికి నిదర్శనమని పేర్కొంది. వీటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల్లో చట్టంపై విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ స్పష్టం చేసింది. తమ కార్యకర్తలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీకి సమర్పించిన లేఖలో కోరారు. డీజీపీ శివధర్ రెడ్డిని కలిసిన అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ప్రాంతాల్లో ఇటీవలి వరుస ఘటనలు రాష్ట్రంలో మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై డీజీపీకి వివరాలతో వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. బాన్సువాడ ఘటనపై మాట్లాడుతూ ఒక హిందూ యువతి భక్తి గీతాలు వినడాన్ని అభ్యంతరం చెప్పి ఆమెపై దాడి యత్నం చేయడం, అవమానించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునివ్వగా ప్రధానంగా బీజేపీకి చెందిన హిందూ యువకులనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకపక్షంగా అరెస్టులు చేశారని విమర్శించారు. సుమారు 27మందిని జైలుకు పంపడమే కాక మరికొందరిని పరారీలో ఉన్నవారిగా చూపుతూ వారి కుటుంబాలను వేధిస్తున్నారని చెప్పారు. కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గుంపుగా వచ్చి దాడి చేయడానికి యత్నించారని. ఇందులో వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారని, మజ్లిస్ పార్టీ సహకారం కూడా ఉందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం వల్లే ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో న్యాయవాది కల్యాణిపై దాడి అత్యంత అమానుషమని అన్నారు. ఒక మహిళా న్యాయవాదిపై దాడి జరగడం చట్ట వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేలా జరిగిందని తెలిపారు.

ఉత్తర తెలంగాణలో మజ్లిస్ అరాచకాలు 

ఉత్తర తెలంగాణ మొత్తం మీద మజ్లిస్ అరాచకాలు పెరుగుతున్నాయని, కొన్ని వర్గాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, దాడులు ఎదుర్కొన్న వారిపైనే కేసులు పెట్టి, అసలు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో అమ్మవారి ఆలయం, బార్కాస్‌లో హనుమాన్ ఆలయం, సఫిల్‌గూడ, ముత్యాలమ్మ ఆలయం, కీసర హనుమాన్ ఆలయం వంటి పలు ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఇవన్నీ ఒకే దిశగా జరుగుతున్నాయా.. దీని వెనుక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. ఈ ఘటనలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్నట్టు పరిస్థితులున్నాయని అన్నారు. ఒక వర్గాన్ని బుజ్జగించే రాజకీయాలే ఈ పరిస్థితులకు కారణమని పేర్కొన్న రామచందర్ రావు తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చేతిలోనే హోం శాఖ ఉన్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. డీజీపీ సానుకూలంగా స్పందించి తగిన విచారణ చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఈ బృందంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గౌతంరావు, వేముల అశోక్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *