రెండేళ్లలోనే గణనీయమైన మార్పు చూపాం

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం
– సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
– సంక్షోభం నుంచి సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం
– అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి చేర్చాలి
– ఆధునికీకరించిన ఐడీపీఆర్ వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఏ మార్పు కావాలని ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో ఆ మార్పును రెండేళ్లలోనే స్పష్టంగా చూపించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి అన్ని రంగాల్లో మరీ ముఖ్యంగా ఆర్ధికరంగంలో పెను సంక్షోభం నెలకొన్న పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కుతూ అభివృద్ది, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారుT. సచివాలయంలో తన ఛాంబర్‌లో ఆధునికీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతున్నదన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయన్నారు. ఈ మార్పులను ప్రజలకు సమర్ధవంతంగా చేరవేయడంలో ప్రజాసంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకమని, ప్రస్తుత పరిస్ధితులకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకుని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు.

సాధించిన విజయాలు అత్యద్భుతం

ప్రభుత్వ పాలనను రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టామని, రెండేళ్ల కాలం మరీ తక్కువే అయినా ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతమని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని, ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచిందని, రాష్ట్రాన్ని భారత దేశంలో, ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో రైజింగ్-2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీపడే లక్ష్యాలను నిర్దేశించుకుని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ వ్యూహంతో పాలన సాగిస్తున్నామన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్దిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామని చెప్పారు. కార్యక్రమంలో ఐడీపీ¾ఆర్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో జి.మల్సూర్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీ.ఎస్.జగన్, జాయింట్ డైరెక్టర్ రమణ తదితర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *