న్యూ స్వదేశీ విజన్‌కు శ్రీకారం

– గ్లోబల్ సప్లై చైన్‌లో నేతన్న యజమానిగా ఎదగాలి
– ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: గతాన్ని విస్మరించొద్దు. భవిష్యత్తుకు ఇంజిన్‌లా మార్చుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి.. ఆ దిశగానే తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హెచఐసీసీ నోవాటెల్‌లో శుక్రవారం నిర్వహించిన 13వ ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. తమ దృష్టిలో టెక్స్‌టైల్ అంటే వ్యాపారం మాత్రమే కాదు.. అది అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయం అని చెప్పారు. గ్లోబల్ సప్లై చైన్‌లో నేతన్న కేవలం కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలన్నదే వతమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఆ దిశగా నేతన్నలను ప్రోత్సహిస్తున్నామని, అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని చెప్పారు. చరఖాకు టెక్నాలజీని అనుసధానించి ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ‘న్యూ స్వదేశీ’ విజన్‌కు ఈ వేదికపై నుంచే శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. దేశం లేదా పరిశ్రమ ఒంటరిగా ఎదగలేదు. ఇది ఎవరూ కాదనలేని అక్షర సత్యం. అందుకే గ్లోబల్ ఫ్యాషన్ కారిడార్లు, సర్య్కులర్ హబ్స్‌తో తెలంగాణను ప్రపంచానికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. డిజిటల్ డిజైన్, గ్లోబల్ కనెక్టివిటీ ద్వారా మన నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలని లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణను కేవలం ఒక ‘ఫ్యాక్టరీ’లా మాత్రమే కాకుండా, కొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘మేధో కేంద్రం’గా తీర్చిదిద్దేలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. లిఅందుకోసం… తక్కువ ధర కంటే, అత్యున్నత నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తున్నాం. బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీస్ సాయంతో సప్లై చైన్‌లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నాం.. కేవలం ఉత్పత్తిపైనే కాక ఆవిష్కరణలను ప్రోత్సహించే ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నాం.. అదే మా ‘విజన్ 2047’.. మాటల్లో కాదు.. చేతల్లోనూ చేసి చూపిస్తున్నాం అని వివరించారు. రైతు, నేతన్న, కార్మికుడు, పెట్టుబడిదారుడు.. ఇలా అందరూ కలిసి లాభాలను పంచుకునే కొత్త పారిశ్రామిక వ్యవస్థకు శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. వాస్తవానికి ఈ లక్ష్యం పెద్దదే కానీ తెలంగాణ భవిష్యత్తు కోసం ఎదురు చూడటం లేదు. దాన్ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉందని మరువొద్దు. భవిష్యత్తును నిర్మించేందుకు ‘తెలంగాణ’తో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసిన పారిశ్రామికవేత్తలు, నిపుణులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్యసాధనలో కీలక భాగస్వాములుగా గౌరవిస్తాం. అన్ని రకాలుగా అండగా ఉంటాం అని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *