“ఏవిధమైన చారిత్రక ఆధారాలు లేకుండా ఒక భాషను అమ్మ, పెద్దమ్మ లేదా సంస్కృతం నుంచి ఆవిర్భవించింది వంటి వాదనలు చేయడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారనేది ప్రజలు గుర్తించాలి. ఇటువంటి వ్యాఖ్యలు సంస్కృతి పరమైన వీరభక్తి ప్రదర్శన తప్ప మరోటి కాదు. దేశ సమైక్యతకు హిందీ దోహదం చేస్తుందన్న వాదన తప్పు. స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాలు, తమ దేశాల్లోని వివిధ భాషలకు చెందిన సమూహాలకు అనుగుణంగా విభిన్న విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీ హిందీ భాషకు ప్రాధాన్యతనిస్తూ, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. వలసవాదంతో బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని నాశనం చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటాం. ప్రస్తుతం బీజేపీ తన హిందూత్వ రాజకీయాల ద్వారా, హిందీయేతర ప్రాంతాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం అందుకు భిన్నమేం కాదు!”
ఒక సంస్కృతిని నాశనం చేయాలంటే ముందు ఆ ప్రాంతపు భాషను ధ్వంసం చేయాలని సాంస్కృతిక ప్రాబల్య సిద్ధాంతం చెబుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే భాషను ధ్వంసం చేయాలంటే ముందుగా అక్కడి సంస్కృతిని తొలగించాలి లేదా అక్కడినుంచి మాయం చేయాలి. ఈ రెండూ అక్కడి సమాజం, ప్రజల గుర్తింపుగా నాటుకుపోయి ఉంటాయి మరి! ఇటలీకి చెందిన తత్వవేత్త, సిద్ధాంతకర్త అంటానియో గ్రామ్‌సీ ప్రతిపాదించిన సాంస్కృతిక ప్రాబల్య సిద్ధాంతం, సంక్లిష్ట సమాజాల్లో భాష ఏవిధంగా పనిచేస్తుందో చక్కగా వివరించారు. ఆధిపత్య గ్రూపులు సమాజాలను కేవలం నిబంధనలు, చట్టాలు లేదా హింస ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకోరు. తాము ఆధిపత్యం వహించాలనుకుంటున్న సమాజంపై ముందుగా తమ భాషను క్రమంగా రుద్దడం మొదలుపెడతారు. ఆవిధంగా తమ ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి లేదా సుస్థిరం చేసుకోవడానికి భాష వారికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారాన్ని నెరపుతున్న ప్రభుత్వం జాతీయవాదం కేంద్రంగా తన రాజకీయాలను కొనసాగిస్తున్నది. ‘ఒకే దేశం–అంతా ఒక్కటే’ అనే పేరుతో అనుసరిస్తున్న విధానం వెనుక లోతైన ‘హిందూత్వ’ వ్యూహం ఉన్నది. ఇందులో భాగంగానే ముందుగా వీటికి అతీతంగా భాషా రాజకీయాలను ముందుకు తీసుకొని రావడం గమనార్హం. రాబోయే కాలంలో ఈ విధానం ప్రాంతీయ భాషలను ధిక్కరించి, ఒకేజాతి-ఒకే భాష అనే అధికసంఖ్యాకుల వాదాన్ని ముందుకు తీసుకొని రావడం ద్వారా క్రమంగా ఫాసిస్ట్ రాజ్య ఏర్పాటు దిశగా ఈ ప్రయాణం సాగుతున్నది. ఈమధ్యనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఒక సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రాంతంపై ఆధిపత్యాన్ని సాధించాలంటే ముందుగా అక్కడి భాషను, సంస్కృతిని ధ్వంసం చేయాలి. కొన్ని శతాబ్దాల క్రితం మనదేశంపై దాడులకు పాల్పడిన దురాక్రమణ దారులు ముందుగా మన ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసి వాటిపై వారికి చెందిన వాటిని నిర్మిస్తూ రావడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు.
ఆమధ్య ప్రముఖ సినీనటుడు కమల్ హసన్ మాట్లాడుతూ, తమిళ భాషనుంచే కన్నడం ఆవిర్భవించిందన్నారు. మరో ప్రముఖ తెలుగు సినీ హీరో, ప్రస్తుత ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు మన తల్లి భాష అయితే హిందీ మనకు పెద్దమ్మ వంటిదన్నారు. ఈయన ప్రస్తుతం తనను తాను సనాతనధర్మ వాదిగా ప్రదర్శితం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భాషల ఉత్పత్తి, వ్యాప్తి వంటి అంశాలపై ఏమాత్రం పట్టులేని వీరు ఈవిధంగా మాట్లాడటం ఎంతవరకు సబబు? అంతేకాదు హిందీని పెద్దమ్మగా చెప్పడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు ఆయన వద్ద ఉన్నాయా? ఈవిధంగా భాషలకు అమ్మ, అక్క, చెల్లి వంటి బంధుత్వాలను కలపడం, ఒక భాషనుంచి మరో భాష పుట్టిందని చెప్పడం వంటివి కేవలం తమ గుర్తింపును ఇతరులపై రుద్దడానికి చేసే ప్రయత్నం తప్ప మరోటికాదు.
భారత్‌లో భాష అనేది కేవలం సమాచారాన్ని పంచుకునే ఒక ఉపకరణం. అంతేకాదు రాజకీయాల్లో, తేడాల వ్యక్తీకరణలో భాషలు ఒక గుర్తింపుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు హిందీని జాతీయవాదంగా, ఇంగ్లీషును కులీనుల భాషగా, ఉర్దూను మతఛాందస భాషగా, తమిళం లేదా మరే ఇతర దక్షిణ భారత ప్రాంతీయ భాషలు ఆయా ప్రాంతాలకు గర్వకారణంగా పరిగణించినప్పడు మనదేశంలోని భాషలు మాటల్లో చెప్పడానికి వీల్లేని ఒక పెద్ద బ్యాగేజీగా మారిపోతాయి. ఇప్పుడు మరోసారి హిందీభాషను రుద్దే యత్నాలపై చర్చను కొనసాగిస్తే, తమిళనాడులో ఎన్ ఈపీ-2020ని అమలు చేయడానికి వచ్చిన అడ్డంకి ఏంటి? మహారాష్ట్రలో తాజాగా లేవనెత్తిన భాషావివాదం మాటేంటి? కమల్ హసన్, పవన్ కళ్యాణ్ వంటి భాషల పుట్టుకలు, చరిత్రపై ఎంతమాత్రం పట్టులేని వారు చేస్తున్న ప్రకటనల మాటేంటి? ఇవన్నీ పరిశీలిస్తే మనకర్థమయ్యేది ఒక్కటే! దేశమంతా ఒకే భాష పేరుతో హిందీని, దక్షిణాదిపై రుద్దే యత్నం జరుగుతున్నదని, ఆవిధంగా దక్షిణాదిపై, ఉత్తరాది ఆధిపత్యాన్ని సాధించాలన్న ఉద్దేశం స్పష్టంగా మనకు తెలుస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం దేశంలో అన్ని రకాల మీడియాలో పతాక శీర్షికలకెక్కింది. ఇంతకూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేంటంటే, మరాఠీ, ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా మూడోభాషగా బోధించాలని! ఇది ఒక్కసారిగా మహారాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నాయకుడు రాజ్ థాకరే ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అప్పటివరకు నిద్రాణంగా ఉన్న ఆయన పార్టీ, హిందీ పుణ్యమాని ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఇంకేం ఉత్తరాదివారిపై దాడులు మొదలయ్యాయి. ఇది రాజకీయరంగు పులుముకొని, బీజేపీ అధ్యక్షుడు ఏకంగా ప్రధానంగా ముంబయిలోని బిహారీ వలసకార్మికులకు మద్దతుగా నిలవడమే కాకుండా, కాంగ్రెస్, ఎంఎన్ ఎస్‌లు కుమ్మక్కయి ఉత్తరాదివారికి వ్యతిరేకంగా రాజకీయాలు నెరపుతున్నాయని ఎదురుదాడికి దిగడంతో వివాదం ముదిరింది. ముఖ్యంగా బిహార్‌లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో మహారాష్ట్ర పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవడానికి యత్నిస్తోంది. ఒక భాషకు అమ్మ, అక్క, చెల్లి వంటి బంధుత్వాలను అంటగట్టడమనేది అదృశ్య ప్రాబల్య చిహ్నాలు. అన్ని సందర్భాల్లో ఇవి రాజకీయ నాయకుల నుంచి మాత్రమే వ్యక్తం కావు. పాఠశాలల పాఠ్యప్రణాళికల ద్వారాకూడా వ్యక్తమవుతుంటాయి. ఈవిధంగా కేవలం ఒక భాషను, వైవిధ్య భరిత భారత్ మొత్తంలో అమలు చేయాలన్న భావన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనేది అక్షరసత్యం.
పాఠ్యప్రణాళికల్లో హిందీని చేర్చడం వల్ల ఒక ప్రాంతానికి చెందిన భాష, గౌరవం, గతంలో ఆయా ప్రాం తాల్లో జరిగిన భాషోద్యమాలను క్రమంగా తెరమరుగవుతాయి. ఇది కేవలం పాఠ్యప్రణాళిక మాత్రమే కాదు, పాఠ్యప్రణాళిక ఆధిపత్యం అంటే సముచితంగా ఉంటుంది. ఈ హిందీ భాష కేంద్రంగా కొనసాగుతున్న జాతీయవాదం వొరవడిలో ఎన్నో ప్రాంతీయ భాషలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. హిందీ భాషాదురభిమానులు, తమ భాషలో భారత గుర్తింపు ఇమిడివున్నదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్‌వంటివారు హిందీని పెద్దమ్మ వంటి పదాలతో పేర్కొనడం వారిలోని అహంకారాన్ని, తెలియనితనాన్ని మాత్రమే బయటపెడుతుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మిగిలిన సమస్యలను పక్కన పెట్టి హిందీ వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భాషా పరిరక్షణ పేరుతో ఇవి తమ అజెండాలను రూపొందించుకోవచ్చు కూడా. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారత్ బలం కేవలం ఒకే భాషపై లేదు. అన్ని భాషలను ఉమ్మడిగా గట్టిగా కలిపివుంచడంలోనే ఉన్నది. ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్న తరుణంలో, అధికసంఖ్యాకుల వాదం బలం పుంజుకుంటున్నప్పుడు భాష అనేది రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఉపకరణంగా మారుతుంది.
ఏవిధమైన చారిత్రక ఆధారాలు లేకుండా ఒక భాషను అమ్మ, పెద్దమ్మ లేదా సంస్కృతం నుంచి ఆవిర్భవించింది వంటి వాదనలు చేయడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారనేది ప్రజలు గుర్తించాలి. ఇటువంటి వ్యాఖ్యలు సంస్కృతి పరమైన వీరభక్తి ప్రదర్శన తప్ప మరోటి కాదు. దేశ సమైక్యతకు హిందీ దోహదం చేస్తుందన్న వాదన తప్పు. స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాలు, తమ దేశాల్లోని వివిధ భాషలకు చెందిన సమూహాలకు అనుగుణంగా విభిన్న విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీ హిందీ భాషకు ప్రాధాన్యతనిస్తూ, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. వలసవాదంతో బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని నాశనం చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటాం. ప్రస్తుతం బీజేపీ తన హిందూత్వ రాజకీయాల ద్వారా, హిందీయేతర ప్రాంతాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం అందుకు భిన్నమేం కాదు!





