– మామునూరు ఎయిర్‌పోర్టుకు భూమి అప్పగింత
– ప్రతాలు అందుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
– రెండున్నరేళ్లలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తిచేస్తాం: మంత్రి హామీ
– కొత్తగూడెం, ఆదిలాబాద్ ల్లో కూడా ఎయిర్‌పోర్ట్ లు అవసరం
– డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమిని సేకరించి కేంద్ర విమానయాన శాఖకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు గురువారం బేగంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పగించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లోనూ ఏర్పాటు చేయదలచిన ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినందనీయమని, తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. 2007లోనే ఎయిర్‌పోర్ట్ అథారిటీతో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ గత పదేళ్లు పాలించిన వారు పట్టించుకోకపోవడంతో నిర్మాణం ఆలస్యమైందన్నారు. హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయిన కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర కేబినెట్ కోరగా వారు సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లడం శుభసూచకం అని అన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు భూ సేకరణకు రూ.300 కోట్లు అవసరమని గుర్తించి వాటిని వెంటనే విడుదల చేసి వడివడిగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.
భూసేకరణ మొత్తం పూర్తి : మంత్రి కొండా సురేఖ
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబందించి భూ సేకరణ మొత్తం పూర్తి అయ్యిందంటూ త్వరలో నిర్మాణం చేపడతారని ఆశిస్తున్నామని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ఎయిర్ పోర్ట్ వస్తే వరంగల్ చాలా అభివృద్ధి చెందుతుందన్నారు.
కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి
తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు ఉంది.. మూడు ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసుకోవాలని సీఎం సంకల్పించారు.. వరంగల్‌లో రైతులను ఒప్పించి భూమి సేకరించారు.. కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీసుకొచ్చి వరంగల్ ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారని ఆశిస్తున్నామన్నారు. మిగిలిన రెండు ఎయిర్ పోర్ట్ లకు కూడా త్వరలో భూ సేకరణ చేయడతాం. మా చిరకాల కోరిక వరంగల్ ఎయిర్‌పోర్టు అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





