– 25వేల స్ప్రింక్లర్ సిస్టమ్స్ ను కేటాయించండి
– కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే) ఉండేలా మరో 16 కొత్త కేవీకేలు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు. ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మంగళవారం కలిసి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రం అవసరమని వివరించారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణం బాగా పెరిగినందున కె.వి.కె.ల అవసరం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 16 జిల్లాల్లో మాత్రమే కె.వి.కెలు పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణం బాగా పెరుగుతున్నందువల్ల తగినన్ని కె.వి.కెల అవసరం ఏర్పడిందన్నారు. వీటి పరిపాలనా నియంత్రణను రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీహెచ్‌యు) తదితర సంస్థలతో చర్చించి నిర్ణయించవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం ఎస్‌కేఎల్‌టీహెచ్‌యు ఆధ్వర్యంలో కేవలం పెద్దపల్లి రామగిరిఖిల్లాకు మాత్రమే కేవీకే వున్నదని, అందువల్ల ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కె.వి.కెలు ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కేవీకేలు రైతులకు ప్రాథమిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడం, తోటల పంటల క్లస్టర్ ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతులు, అధిక విలువ కలిగిన పంటలు, ఔషధ, సుగంధ మొక్కల ప్రోత్సాహం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతులు, డిజిటల్ సాధనాల వాడకంలో రైతులకు మద్దతు ఇస్తాయని ఆయన తెలిపారు. అదనంగా 25,000 పోర్టబుల్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ను కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 16,510 పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్లు కేటాయించగా, ఇప్పటివరకు 11,000 యూనిట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసి, 9,346 యూనిట్లు ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరానికి అనుగుణంగా ఇప్పటికే పంపిణీ చేసినట్లు తెలిపారు.రబీ సీజన్లో ముఖ్యంగా వేరుశెనగ, పప్పుధాన్యాలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి పంటలు వేసే చిన్న, సన్నకారు రైతులు ఈ స్ప్రింక్లర్ల పద్ధతిని అనుసరించేందుకు వాటి వ్యయం పెద్ద అడ్డంకిగా మారుతున్నందున, రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రానికి అదనంగా 25,000 పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్లు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
2 లక్షల టన్నుల యూరియా లోటు భర్తీ చేయాలి
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌తో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఖరీప్ సీజన్‌లో ప్రణాళిక ప్రకారం ఇప్పటిదాకా ఏర్పడిన యూరియా లోటు 2 లక్షల టన్నులను ఈ నెలలోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్‌లో రౖౖెతాంగానికి ఇబ్బంది లేకుండా మందుగానే ప్రతి నెలా రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చెయ్యాలని కోరారు. జియోపొలిటికల్ కారణాల వల్లనే సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని మంత్రి తుమ్మలకు కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే