బీసీల‌కు స‌ముచిత స్థానం ద‌క్కాలి

– బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష ప్రారంభం
– ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం చేపట్టారు. తొలుత బీఆర్‌ అంబేడ్కర్‌, ఫూలే, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగహ్రాలకు నివాళులర్పించారు. కార్యకమ్రానికి కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఈరోజు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి.. ఆర్థిక అవకాశాలు రావాలి.. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు.. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అని చెప్పారు. అందరి ఆకాంక్ష ఒక్కటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తోంది అని ఆమె విమర్శించారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాల్సి ఉందన్నారు. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చి వారిని మినహాయించి బీసీలకే 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పాలి.. అప్పుడు బీజేపీ ఎందుకు ఒప్పుకోదో మేమూ చూస్తాం అని కవిత అన్నారు. ముస్లింలకు 10శాతం రిజర్వేషన్‌ కోసం ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషిచేయాలి అని కవిత సూచించారు. కాగా, నిరాహారదీక్ష ప్రారంభించడానికి ముందు తన నివాసంలో ఆమె పూజలు చేశారు. ఆనంతరం తన అత్తమామలు దేవనపల్లి రాంకిషన్‌ రావు, నవలత, భర్త అనిల్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *