– ఆ కుటుంబానికి అండగా ఉంటా
– ఆయన సతీమణికీ ఉపాధి, పిల్లల చదువులకు భరోసా
-! తక్షణ సహాయంగా రూ.10లక్షలు అందజేత
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నకిరేకల్, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్ పార్టీకి చెందిన కుర్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపట్ల నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన సామాజిక న్యాయ సమర భేరి సభకు హాజరైన కుర్రి శ్రీనివాస్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు శనివారం ఉదయం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శ్రీనివాస్ పార్థివ దేహం మీద పుష్ప గుచ్ఛం ఉంచి మంత్రి ఉత్తమ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన శ్రీనివాస్ మరణం తనను కలచి వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అంటే తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానని అన్నారు. శ్రీనివాస్ ఇద్దరు పిల్లల విద్యాభ్యాసం బాధ్యతలు తాను తీసుకోవడమేకాకుండా శ్రీనివాస్ సతీమణికి తగిన ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు అప్పటికప్పుడు తక్షణ సహాయంగా శ్రీనివాస్ కుటుంబానికి మంత్రి ఉత్తమ్ రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.




