– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
– రిజిస్ట్రార్ రామచంద్రం
కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో విద్యార్థులపై ఆంక్షలు పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో, హాస్టళ్ళలో ఆంక్షలు విధిస్తూ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. విద్యాలయంలో హాస్టల్, కళాశాల నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రామచంద్రం హెచ్చరించారు. విశ్వవిద్యాలయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పీజీ విద్యార్థులు, పరిశోధనా విద్యార్థుల క్యాంపస్ ప్రవర్తన నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కొన్ని కార్యకలాపాలను గమనించిన నేపథ్యంలో, విద్యార్థులు, పరిశోధనా విద్యార్థులందరికీ సూచనలు జారీ చేసారు. విశ్వవిద్యాలయంలో శాంతిభద్రతలు, క్రమశిక్షణ కాపాడుతూ విద్యా వాతావరణాన్ని సమర్థంగా కొనసాగించేందుకు ఈ మార్గదర్శకాలు తక్షణం అమలులోకి వస్తాయన్నారు. ముఖ్యం గా అకడమిక్ బ్లాక్‌లు, కారిడార్‌లు, ఇతర మార్గాలు లేదా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఏ భాగంలోనైనా పుట్టినరోజు వేడుకలు, ఇతర వ్యక్తిగత కార్యక్రమాల నిర్వహణ నిషేధించారు. విద్యార్థులు ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు, క్యాంపస్ గేట్ల సమీపంలో రాత్రి 9 గంటల తర్వాత గుమిగూడడం, కూర్చోవడం, తిరగడం పూర్తిగా నిషేధించబడిందన్నారు. హాస్టల్‌లో నాన్ బోర్డర్లు వారం లోపు హాస్టల్స్‌ను తప్పనిసరిగా ఖాళీ చేయాలన్నారు. అనధికారిక బసను తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్ గదుల్లో లేదా ప్రాంగణంలో అనధికారిక వ్యక్తులను బస చేయడానికి అనుమతించే లేదా సహకరించే హాస్టల్ బోర్డర్లపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ జారీ చేశారు. హాస్టల్ బోర్డర్లు ఎప్పటికప్పుడు ధృవీకరణ కోసం తమ ఐడి కార్డులను కలిగి ఉండాలని సూచించారు. ఈ సూచనలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




