పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిన కెసిఆర్ కుటుంబం
కెసిఆర్ కుటుంబ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలి
పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ దోపిడీని భరించలేకనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు. గత పదేండ్లలో జరిగిన భూ దోపిడీపై విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.కేసీఆర్ కుటుంబంపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ అంశానికి కేటీఆర్ అరెస్ట్‌కు లింక్ పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటున్నారన్నారు. పదేండ్లలో భూ దోపిడి చర్చకు సిద్ధమా?.. దమ్ము ధైర్యముంటే చర్చకు రండంటూ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమని ఆయన అభివర్ణించారు. లిక్కర్ స్కాం చేసింది కూడా కేసీఆర్ కుటుంబమేనని ఆయన గుర్తు చేశారు.
అడ్డమైన వాళ్లు వచ్చి మాట్లాడుతున్నారని.. ఈ మాటలను నమ్మకండంటూ తెలంగాణ ప్రజలకు పీసీసీ చీఫ్ సూచించారు. కేటీఆర్ ఇంతగా దిగజారుతాడా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. చాలా తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ధనం దోపిడి చేసింది కేసీఆర్ కుటుంబమేనని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. బిల్లీ రావుతో కేటీఆర్ ఒప్పందం చేసుకున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ గుంటూరులో ఏం చదువు నేర్చుకున్నాడో అర్థం కావడం లేదన్నారు. సగం సగం తెలుసుకొని రాజకీయ లబ్ది కోసం కేటీఆర్ మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు. బీసీ కుల గణన వల్ల బీఆర్‌ఎస్ పార్టీలో వణుకు పుట్టిందన్నారు. బీఆర్‌ఎస్ పదేండ్లలో ఎన్నివేల ఎకరాలను కొల్లగొట్టారో తెలియదా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.రైతులు బాగు పడుతుంటే కేటీఆర్‌కి కడుపు నొప్పి వస్తోందని ఎద్దేవా చేశారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేయించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపారంటూ బీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణకి ఉద్యోగాలు రాకూడదా? అంటూ బీఆర్‌ఎస్ నేతలు సూటిగా ప్రశ్నించారు.





