కాంగ్రెస్ మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి

– వికారాబాద్‌లో బీఆర్ ఎస్ జ‌య‌కేతనం ఎగుర‌వేయాలి
– స‌బ్బండ వ‌ర్గాల‌ కోసం ప‌నిచేసిన బీఆర్ఎస్‌
– పార్టీ నాయ‌కుల‌ను ప‌ట్టించుకోలేదు
– ఈ పొర‌పాటు మ‌ళ్లీ చేయ‌బోం : కె.టి.ఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్ రైట్ అవుతార‌ని బీఆర్ ఎస్‌ వర్కింగ్ కే.తారక రామారావు అన్నారు.  వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు భారీ సంఖ్యలో ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో బుధ‌వారం జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్, ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివన్న కేటీఆర్, టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్యాడర్ కు సూచించారు. ఆరు గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. మీసేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను జారీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సభల్లో గప్పాలు కొట్టుకుంటున్నాడని కేటీఆర్  విమర్శించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  అభ్యర్థితో సంబంధం లేకుండా కారు గుర్తుకు ఓటు వేసే లాగా ప్రజలను చైతన్యపరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్ స్థానం బీఆర్ఎస్ దే అవుతుంద‌న్నారు. సమైక్య పాలనలో తెర్లు అయిన తెలంగాణను బాగు చేయాలన్న లక్ష్యంతో ప‌దేళ్లు  అధికారంలో ఉండి దీక్షగా పనిచేశామ‌న్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఓ తపస్సులాగా తెలంగాణలోని సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పనిచేశామ‌న్నారు. ఆనాడు ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం వాస్తవమ‌ని అంగీక‌రించారు. రేపు అధికారంలోకి వచ్చాక గతంలో చేసిన తప్పును పునరావృత్తం చేయబోమ‌న్నారు. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటామ‌న్నారు.
వికారాబాద్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన జిల్లాను ఏర్పాటుచేసి సరిగా చెప్పుకోలేపోయాం.
వికారాబాద్ కు మెడికల్, నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా  ఎవరు అనుకోలేదు. కానీ కేసీఆర్  దాన్ని సాకారం చేశారని గుర్తుచేశారు. పెన్షన్లు రూ.2000 అవుతాయని, రైతుబంధు ఠంచన్ గా పడుతుందని, రుణమాఫీ అవుతుందని, రైతు బీమా చేస్తారని, బాలింతలకు కేసిఆర్ కిట్ ఇస్తామని ఎవరూ అనుకోలేదు కానీ అవన్నీ చేసి చూపించాం. అయితే వాటిని మాత్రం సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామ‌న్నారు. ఆడబిడ్డలకు రూ. 300 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. కానీ కెసిఆర్  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డలకు రూ.3000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇచ్చారు. కాని ఏనాడు దాన్నో గొప్ప పనిలాగా చెప్పుకోలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రితో కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాని అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు 6.5 లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చాం. ఒక్క  రంగారెడ్డి జిల్లాలోనే 90 వేల కార్డులు ఇచ్చామ‌న్నారు. అయితే ఈ పనులు అన్నింటిని ఏవో ఘనకార్యాలుగా మేము ఎన్నడు భావించలేదు.  ప్రజలకు రొటీన్ గా చేసే సేవే అనుకున్నామ‌న్నారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది.  పెన్షన్ తీసుకునే పెద్దమనుషులకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఆడపిల్లలకు ఐదు లక్షల భరోసా కార్డు, స్కూటీలు, నెలకు రూ.2500లు  ఇస్తా అన్నాడు. కానీ ఏమి చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి రూ.50 వేలు బ‌కాయి వున్నాడ‌న్నారు.  తెలంగాణలోని ప్రతి వర్గం కాంగ్రెస్ చేతిలో మోసపోయింద‌న్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ, రైతుబంధు రూ.15000, వడ్లకు బోనస్, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానన్న  రేవంత్ రెడ్డి ఇవాళ తప్పించుకుని తిరుగుతున్నడ‌ని ఆరోపించారు. 11 సార్లు రైతుబంధువేసి ఏనాడు కెసిఆర్  రాజకీయం చేయలేదు. అన్నదాతలకు న్యాయం చేశామనే అనుకున్నారన్నారు.  నాట్లు వేసేటప్పుడు ఇవ్వకుండా ఓట్లు వేసే టైంకు రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 20 నెలలో ఒకసారి మాత్రమే రైతుబంధువేసి దానికి సంబరాలు చేసుకోవాలని చెప్తున్నాడన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడ‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్ ను నిందిస్తున్నాడని ఆరోపించారు. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిన సమయంలో కూడా పెన్షన్, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి , కెసిఆర్ కిట్, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కేసీఆర్ టైం కు ఇచ్చారని గుర్తుచేశారు.  ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు పోకుండా అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేలా ప్రతి కార్యకర్త పనిచేయాల‌ని పిలుపునిచ్చారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీఫైనల్ లాంటివి. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. మా కోసం కష్టపడ్డ క్యాడర్ను మేం గెలిపించుకుంటాం. ఇంటింటికి తిరిగి కడుపులో తలకాయ పెట్టి ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించి చెప్పాలి. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ లోనే కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టడం సిగ్గుచేటు. మల్కాజ్ గిరిలో గుండాలు రోడ్డు మీద షో చేస్తే పోలీసులు ఏమి చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తే  అధికారులు అందరూ సెట్ రైట్ అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ ఒక్కటై పని చేసి గెలిపించుకోవాలి.మళ్లీ వికారాబాద్ జిల్లాలో గులాబీ జెండాను ఎగురవేయాలి.  కెసిఆర్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నిక అవుతాన్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *