– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
– సమాజం తలదించుకునే ఘటన
– హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి వారూ దోషే
– బాధితురాలికి తక్షణ సాయం రూ.లక్ష అందజేత
నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఇటీవల జాతర సందర్భంగా బలహీనవర్గాల వ్యక్తిపై దాడికి కారకులైనవారికి, పసికందు హంతకులకు శిక్ష పడాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హంతకుడు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిని జైల్లో పెట్టాలని, దాడి చేసిన ఎనిమిదిమందిపై హత్యా నేరం కేసులు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని, భాదిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మల్లన్న స్వామి జాతరలో దేవుడిని దర్శించుకునే అవకాశం కల్పించాలని అడిగితే చంద్రకళ కుటుంబంపై తీవ్రంగా దాడి చేసి మానవత్వానికే మచ్చ తెచ్చారన్నారు. 21వ శతాబ్దంలో కూడా కులాలు, మతాల పేరిట ఒకరిని తక్కువగా చూడటం, అవమానించడం, అధికారం అండతో హత్యా రాజకీయాలు, హంతకులను కాపాడే ప్రయత్నం జరగడం సిగ్గుచేటన్నారు. ఇంత అమానవీయ ఘటన జరిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం క్షమించరాని నేరమని అన్నారు. కుమ్మెర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పసిపాప కుటుంబాన్ని కేటీఆర్ బుధవారం పరామర్శించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలిసి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఒక రాజకీయ నాయకుడిగా కాక ఒక తండ్రిగా, సమాజంలోని ఒక వ్యక్తిగా ఈ కుటుంబానికి అండగా నిలబడేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పసిపాప ప్రాణాలు పోయిన తీరు మాటలకు అందని మహా విషాదమన్నారు. ఇంతటి అమానవీయమైన ఘటన జరిగినప్పుడు రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదని, ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని అన్నారు. మీడియా, రాజకీయ నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ హత్యను ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తున్నదని ఆరోపించారు. పసిపాప హంతకులకు ఉరిశిక్ష వేసినా తక్కువేనన్నారు. ఈ అంశంలో బాధితులకు అండగా నిలబడిన నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలకు, ఇతర నాయకులకు ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి తక్షణ సహాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





