కేటీఆర్‌.. కొత్త డ్రామాలు మానుకో

– ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రంలో కేటీఆర్‌ మరో కొత్త డ్రామాకు తెరలేపారని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బనకచర్ల అంశంపై చర్చకు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్‌ విసిరితే నువ్వు నీ స్థాయిని మరచి ముఖ్యమంత్రిని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్‌ విసరడం ఏమిటని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌, హరీష్‌రావు ఆంధ్రకు నీళ్లు పంపించారని ఆరోపించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు పరిమితం కాగా కేటీఆర్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సవాల్‌ విసిరి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఏమి చేసిందని అడుగుతున్నావ్‌.. 2009లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రిగా రైతుల కోసం వైఎస్‌ఆర్‌ రుణమాఫీ చేశారని, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ, అత్యధిక ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్‌ పార్టీ, కేసీఆర్‌ కట్టిన అని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎస్‌ఆర్‌ఎస్పీ నుండి నీళ్ళు అందించింది కాంగ్రెస్‌ పార్టీ అని ఐలయ్య వివరించారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, జూరాల, నేట్టెంపాడు, దేవాదుల వంటి అనేక ప్రాజెకులను తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు నిర్మాణం చేశాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రేడ్డి ప్రజాపాలన 18 నెలల్లో రైతుల కోసం, లక్ష కోట్లు ఖర్చు పెట్టారని, ముఖ్యమంత్రి, మంత్రులు విదేశీ పర్యటన చేసి అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ స్థాయి అంటే అమరవీరుల త్యాగంతో ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పనంగా దోచుకు తినటమా.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో వ్యవహరించకుండా ఫాంహౌస్‌కు పరిమితం కావడమా అని ఆయన ప్రశ్నించారు. సోనియా ఇచ్చిన అభయ హస్తం ఆరు గ్యారెంటీలతోపాటు, చెప్పకుండనే ఇస్తున్న అనేక పథకాలకు ప్రజాదరణ చూసి ఓర్వలేక కేటీఆర్‌ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. ఒక్క సంవత్సరంలో రూ.22వేల కోట్లతో రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పండిస్తే రూ.500 బోనస్‌ ఇచ్చినం.. ధాన్యం కొన్న వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినం అని ఐలయ్య వివరించారు. రాయలసీమకు పోయి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్‌ ఆ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ఒప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై చిల్లరమల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఊరికించి కొడతారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *